Share News

కారిడార్‌ పనులు అడ్డగింత

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:22 AM

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం భూములిచ్చిన తమకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారంటూ నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు.

కారిడార్‌ పనులు అడ్డగింత
రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న కారిడార్‌ నిర్వా

న్యాయం చేయాలని నిర్వాసితులు డిమాండ్‌

పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారని నిలదీత

హోం మంత్రి, కలెక్టర్‌తో 17 సమావేశం

అప్పటి వరకు పనులు ఆపాలని నిర్ణయం

నక్కపల్లి, సెప్టెంబరు 11: విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం భూములిచ్చిన తమకు పూర్తిస్థాయిలో పరిహారం, ప్యాకేజీ ఇవ్వకుండా పనులు ఎలా చేస్తారంటూ నిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. కారిడార్‌ భూముల్లో పనులను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ మంగళవారం హెచ్చరించగా, బుధవారం ఉదయం చందనాడ గ్రామంలో వున్న కారిడార్‌ భూముల్లో యంత్రాలతో తుప్పలు తొలగిస్తున్న విషయం తెలిసి నిర్వాసిత రైతులు పనులు అడ్డగించేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, చందనాడ ఎంపీటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, సర్పంచ్‌ తళ్లా రోహిణి భార్గవ్‌ అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నక్కపల్లి, పాయకరావుపేట సీఐలు కుమారస్వామి, అప్పన్న, ఎస్‌ఐ సన్నిబాబుల నేతృత్వంలో పోలీస్‌ బలగాలు చేరుకున్నాయి. పనులు ఆపవద్దని ఆందోళనకారులకు తహసీల్దార్‌ అంబేడ్కర్‌ విజ్ఞప్తిచేయగా, తమకు న్యాయం చేయకపోతే గతంలో ఇచ్చిన పరిహారాన్ని తిరిగి ఇచ్చేస్తామని, భూములను తమకు అప్పగించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. మీ సమస్యలపై ఈ నెల 17న హోం మంత్రి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో కృష్ణణ్‌తో సమావేశం ఏర్పాటు చేశామని, అక్కడకు వచ్చి సమస్యలు చెప్పాలని తహసీల్దార్‌, సీఐలు సూచించారు. అయితే అప్పటి వరకు కారిడార్‌ పనులు ఆపాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. దీంతో అధికారులు ఇక్కడ సమస్యను ఉన్నతాధికారులకు వివరించారు. 17వ తేదీ వరకు పనులు చేపట్టబోమని అధికారులు చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రతినిధులు తళ్లా అప్పలస్వామి, గెడ్డమూరి గోవింద్‌, సూరకాసుల గోవింద్‌,వాసుపల్లి రాజు, మడుగుల తాతాజీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 07:26 AM