Share News

‘పల్లా’కు పట్టాభిషేకం

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:40 AM

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు.

‘పల్లా’కు పట్టాభిషేకం

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం

- ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు

- ఉత్తరాంధ్ర నుంచి మూడో వ్యక్తికి పార్టీలో కీలక పదవి

విశాఖపట్నం, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ పదవి నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ఆ పదవిలో పల్లా శ్రీనివాసరావును నియమించాలని అధినేత చంద్రబాబు మూడు రోజుల క్రితమే నిర్ణయించి, ఆ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోనే గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాసరావుకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. పదవుల పంపకంలో సమీకరణల నేపథ్యంలో పల్లాకు మంత్రి పదవి రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీలో అత్యున్నతమైన రాష్ట్ర అధ్యక్ష పదవిని అధినేత కట్టబెట్టారు. వెనుకబడిన యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావు కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. పల్లా తండ్రి సింహాచలం 1994లో విశాఖ-2 నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పల్లా శ్రీనివాసరావు 2020 నుంచి విశాఖ పార్లమెంటు అధ్యక్షునిగా సుమారు నాలుగేళ్లు పనిచేశారు. ఇదిలావుండగా ఉత్తరాంధ్ర నుంచి కిమిడి కళావెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు తరువాత రాష్ట్ర అధ్యక్ష పదవి వరించిన మూడో వ్యక్తి పల్లా శ్రీనివాసరావే. ఈ ముగ్గురు కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడం గమనార్హం.

ఘన స్వాగతానికి సన్నాహాలు

గాజువాక: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విశాఖ రానున్నారు. ఈ తరుణంలో ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కేడర్‌ సన్నాహాలు చేస్తోంది. పార్టీలో కీలక పదవి రావడంతో నియోజకవర్గం టీడీపీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయం నుంచి పల్లా శ్రీనివాసరావును గాజువాక వరకు భారీ ర్యాలీగా స్వాగతించేందుకు అన్ని వార్డుల్లోని టీడీపీ కార్పొరేటర్‌లు, నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Updated Date - Jun 17 , 2024 | 01:40 AM