Share News

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి

ABN , Publish Date - May 27 , 2024 | 11:38 PM

శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లాకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తీసుకురావాలని, ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ కోరారు.

శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మురళీకృష్ణ

జిల్లాకు మంచి గుర్తింపు తేవాలి

రాజకీయ పార్టీల నేతలకు ఎస్పీ కేవీ మురళీకృష్ణ సూచన

అనకాపల్లి టౌన్‌, మే 27: శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లాకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తీసుకురావాలని, ఇందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ కోరారు. స్థానిక రింగురోడ్డులోని ఫంక్షన్‌హాల్‌లో సోమవారం శాంతి భద్రతల పరిరక్షణ అవగాహన సదస్సు అనకాపల్లి డీఎస్పీ ఎస్‌.అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరిగేందుకు తోడ్పడాలన్నారు. అలాగే పార్టీల నాయకులు గ్రామస్థాయిలో కూడా ఓట్ల లెక్కింపు రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. జూన్‌ ఒకటో తేదీన వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌, నాల్గో తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో కూడా అందరూ సంయమనం పాటించాలని కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓట్ల లెక్కింపు రోజున 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన తరువాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయరాదని, బాణసంచా కాల్చరాదని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ఘర్షణలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బీఎస్‌ఎంకే జోగినాయుడు, కె.జగ్గారావు, వైసీపీ పట్టణశాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజులు మాట్లాడుతూ పార్టీలు వేరైనా తామంతా సోదర భావంతో వ్యవహరిస్తుంటామని, ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతియుత వాతావరణం కల్పించడానికి సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ అప్పలరాజుతో పాటు పట్టణ సీఐ జి.శంకరరావు, రూరల్‌ సీఐ ధనుంజయరావు, కశింకోట సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐలు సత్యనారాయణ, మహ్మాద్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:38 PM