Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఫుడ్‌కోర్ట్‌ తొలగింపుపై మీనమేషాలు!

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:16 AM

పాతజైలురోడ్డులోని నైట్‌ ఫుడ్‌కోర్ట్‌పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

ఫుడ్‌కోర్ట్‌ తొలగింపుపై మీనమేషాలు!

పది నెలల కిందటే జీవీఎంసీ కౌన్సిల్‌ తీర్మానం చేసినా స్పందన శూన్యం

మేయర్‌ ఆదేశాలనూ పట్టించుకోని అధికారులు

వైసీపీ నేతలే అడ్డుపడుతున్నారంటున్న టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది

రోజువారీ మామూళ్లు దండుకుంటున్నారని ప్రతిపక్షాల విమర్శలు

పాత జైలురోడ్డులో అనధికారికంగా కొనసాగుతున్న ఫుడ్‌కోర్ట్‌

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

‘పాతజైలురోడ్డులోని నైట్‌ ఫుడ్‌కోర్ట్‌పై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ట్రాఫిక్‌ ఇబ్బందులతోపాటు వ్యర్థాల కారణంగా తీవ్ర దుర్వాసన వెలువడుతోందని చుట్టుపక్కల నివాసితులు గగ్గోలు పెడుతున్నారు. ఫుడ్‌కోర్ట్‌ వెనుకవైపు కొంతమంది బహిరంగంగానే గంజాయి సేవిస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్‌కోర్ట్‌ను మరో చోట ఏర్పాటుచేయాలని జీవీఎంసీ కౌన్సిల్‌ నిర్ణయించింది’

గత ఏడాది మేలో జరిగిన జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ప్రకటన.

పదినెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఫుడ్‌కోర్ట్‌ తొలగింపు జరగలేదు. దీనిపై పాలకవర్గంలోని కొంతమంది పెద్దలతోపాటు స్థానిక వైసీపీ నేతకు భారీగా డబ్బులు ముడుతుండడంతో అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో అర్ధరాత్రి సమయంలోనూ పర్యాటకులు, సందర్శకులు, నగరవాసులకు ఆహారం అందుబాటులోకి ఉంచేందుకు వీలుగా పాతజైలురోడ్డులో నైట్‌ ఫుడ్‌కోర్ట్‌ను ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో దీనిని మూసివేయగా ఆ తర్వాత తెరిచేందుకు జీవీఎంసీ అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు, పాలకవర్గంలోని కొంతమంది పెద్దల అండతో కొంతమంది వ్యాపారులు పాతజైలురోడ్డులో అనధికారికంగా దుకాణాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 32 దుకాణాలతో పునఃప్రారంభమైన ఫుడ్‌కోర్ట్‌లో తాజాగా 150కిపైగా దుకాణాలున్నాయి. అక్కడి నుంచి ఫుడ్‌కోర్ట్‌ను నుంచి తొలగించాలంటూ స్థానిక కార్పొరేటర్‌తోపాటు నివాసితులు ఫిర్యాదు చేయడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ అనధికారికంగా దుకాణాలు ఏర్పాడు చేయడంతో జీవీఎంసీకి ఆదాయం సమకూరడం లేదు. పైగా ఫుడ్‌కోర్ట్‌ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నందున తక్షణం తొలగించాలంటూ స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.

కౌన్సిల్‌లో ప్రస్తావించిన కార్పొరేటర్‌

గత ఏడాది మేలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఫుడ్‌కోర్ట్‌ కారణంగా జీవీఎంసీకి పైసా ఆదాయం రావడం లేదని, పాలకవర్గంలోని కొందరు పెద్దలు, అధికారులు భారీగా డబ్బులు దండుకుంటున్నారంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లతోపాటు అధికారపార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తక్షణం ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని పట్టుబట్టడంతో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి తొలగించేందుకు ప్రతిపాదన చేశారు. దీనికి కౌన్సిల్‌ సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. వారం రోజుల్లో ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని జీవీఎంసీ అధికారులను మేయర్‌ ఆదేశించారు.

నెలలు గడిచినా చర్యల్లేవ్‌...

తర్వాత ఏం జరిగిందోగానీ.... ఇంతవరకూ ఫుడ్‌కోర్ట్‌ను తొలగించలేదు. కౌన్సిల్‌లో తీర్మానం చేసిన తరువాత కూడా దుకాణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిపై జనసేన, టీడీపీ కార్పొరేటర్లు కలిసి విలేకరుల సమావేశం పెట్టి ఫుడ్‌కోర్ట్‌ తొలగింపును మేయర్‌ స్వయంగా ఆదేశించినా, ఎందుకు అమలుచేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిల్‌లో చేసిన తీర్మానాన్ని అమలుచేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. పాలకవర్గంలోని కొంతమంది పెద్దలకు ఫుడ్‌కోర్ట్‌లోని దుకాణాల నుంచి మామూళ్లు అందుతుండడమే కారణమని ఆరోపించారు.

అధికార పార్టీ అండతోనే...

వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, పాలకవర్గంలోని కొంతమంది పెద్దల అండతోనే ఫుడ్‌కోర్ట్‌ నడుస్తోందనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆ దుకాణాల జోలికి వెళ్లొద్దని టౌన్‌ప్లానింగ్‌ అధికారులను వారు ఆదేశించినట్టు సమాచారం. పాలకవర్గంలోని కొందరు పెద్దలకు ఎమ్మెల్యే మద్దతు తెలపడం కలిసొచ్చింది. ఎమ్మెల్యే ఆదేశాలనే ధిక్కరిస్తారా? పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వాపోతున్నారు. ఫుడ్‌కోర్ట్‌ కొనసాగింపునకు అధికారపార్టీ నేతలంతా సానుకూలంగా ఉన్నపుడు మనమెందుకు అనవసరంగా జోక్యం చేసుకోవాలనే భావనతో అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. ఇదిలావుండగా ఫుడ్‌కోర్ట్‌లోని దుకాణాల నుంచి పాలకవర్గంలోని కొందరు పెద్దలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధితోపాటు అధికారులకు కూడా ప్రతిరోజూ వాటాలు అందుతున్నాయని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆరోపిస్తున్నా వారి నుంచి స్పందనలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Updated Date - Mar 04 , 2024 | 01:16 AM