Share News

ఆర్టీసీ స్థలంపై మరోసారి రాజుకున్న వివాదం

ABN , Publish Date - Aug 24 , 2024 | 01:14 AM

ఆర్టీసీ స్థలం లీజు వ్యవహారం మరోసారి వివాదానికి తెరలేపింది. లీజుదారుడు స్థలం చదును చేసేందుకు గురువారం రాత్రి గ్రావెల్‌ తోలడంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

ఆర్టీసీ స్థలంపై మరోసారి రాజుకున్న వివాదం
ఆర్టీసీ స్థలంలో లీజ్‌దారుడు తోలించిన మట్టి

7,550 గజాల టెండర్‌ దక్కించుకున్న డాక్టర్‌ శ్రీనివాస్‌

నెలకు రూ.4.16 లక్షలు అద్దె చెల్లిస్తున్న లీజుదారుడు

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టడానికి నిర్ణయం

స్థలాన్ని చదును చేయిస్తున్న లీజుదారుడు

ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ఖాళీ స్థలం ఆర్టీసీ అవసరాలకు ఉంచాలన్న స్పీకర్‌

నర్సీపట్నం,ఆగస్టు 23: ఆర్టీసీ స్థలం లీజు వ్యవహారం మరోసారి వివాదానికి తెరలేపింది. లీజుదారుడు స్థలం చదును చేసేందుకు గురువారం రాత్రి గ్రావెల్‌ తోలడంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పదవినైనా వదలుకుంటాను గాని స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయనివ్వనని ఘంటాపఽథంగా చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ స్థలం ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇస్తే అయ్యన్నపాత్రుడు అంగీకరించలేదు. ఆర్టీసీ అధికారులు రెండోసారి అదే తప్పు చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. వివరాలిలా ఉన్నాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో నర్సీపట్నం ఆర్టీసీ డిపోలోని 7,550 చదరపు గజాల స్థలం అద్దెకు ఇవ్వడానికి గత ఏడాది టెండర్లు ఆహ్వానించారు. విశాఖపట్నంకు చెందిన డాక్టర్‌ చిన్ని శ్రీనివాస్‌ నెలకు రూ.4.16 లక్షలు అద్దె ఇవ్వడానికి టెండరు దక్కించుకున్నారు. 2023 ఆగస్టు 26 నుంచి 2038 ఆగస్టు 25 వరకు 15 సంవత్సరాలకు లీజ్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. రెండు అంతస్తులు మాత్రమే నిర్మాణం చేసుకోవడానికి అంగీకరించారు. నిర్మాణ పనులు చేసుకోవడానికి ఆరు నెలలు గడువు ఇచ్చి, ఆ తర్వాత అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. స్థలం అద్దెకు తీసుకున్న డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎటువంటి నిర్మాణం చేయలేదు. ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆరు నెలలు గడువు తీరిపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అద్దె చెల్లిస్తున్నారు. ఇటీవల సుమారు రూ.20 లక్షలు అద్దె బకాయిలు చెల్లించినట్టు తెలిసింది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫారం వేయించుకోవడానికి డిపో మేనేజర్‌ని ఎన్‌వోసీ కోసం కోరగా.. ఆర్టీసీ ఎలరక్షికల్‌ డీఈఈకి దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్‌ సూచించారు. డాక్టర్‌ చిన్ని శ్రీనివాసరావు మూడు రోజులుగా లీజుకు తీసుకున్న స్థలాన్ని చదును చేయించారు. గురువారం రాత్రి గ్రావెల్‌ మట్టితోలించారు.

పనులు మొదలు పెట్టడంపై సభాపతి ఆగ్రహం

ఆర్టీసీ స్థలంలో గ్రావెల్‌ మట్టి తోలిన విషయం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు దృష్టికి వెళ్లింది. శుక్రవారం ఆయన స్థలం పరిశీలించడానికి డిపో ఆవరణలోకి వచ్చారు. ప్రభుత్వ స్థలంలో మట్టి తోలుతుంటే డిపో మేనేజర్‌, సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డిపోలోకి లారీలను ఎలా రానిచ్చారని డిపో మేనేజర్‌పై మండి పడ్డారు. లీజుదారుడితో ఆర్టీసీ అధికారులు కుమ్మక్కయ్యారని విమర్శించారు. సీసీ పుటేజీలు ఆధారంగా గ్రావెల్‌ మట్టి తోలిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీని మీద అసెంబ్లీలో చర్చకు పెడతానని హెచ్చరించారు. ఈ ఖాళీ స్థంలో రెండో ఫ్లాట్‌పారం నిర్మించాలన్నారు. స్పీకర్‌ వెంట కౌన్సిలర్‌ చింతకాయల రాజేశ్‌, టీడీపీ నాయకులు ఉన్నారు.

వందలాది మందికి ఉపాధి

లీజుదారుడు చిన్ని శ్రీనివాసరావు

ఆర్టీసీ స్థలం 15 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నామని, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేస్తే వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని డాక్టర్‌ చిన్ని శ్రీనివాసరావు అన్నారు. ఆర్టీసీ టెండర్లు ఆహ్వానిస్తే పాల్గొని 15 సంవత్సరాలు లీజుకి తీసుకున్నానని తెలిపారు. జీఎస్టీతో కలుపుకొని నెలకు సుమారు రూ.5లక్షలు అద్దె చెల్లిస్తున్నానన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:14 AM