కొనసాగిన ముసురు
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:01 AM
వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ ఏకధాటిగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ ఏకధాటిగా వాన
గంభీరం, కాపులుప్పాడలో 77.25 మిల్లీమీటర్లు నమోదు
విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కొనసాగాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకూ ఏకధాటిగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పద్మనాభం, భీమిలి మండలాల్లో వరి పంట నీట మునిగింది. శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు గంభీరం, కాపులుప్పాడలో 77.25, విశాఖ రూరల్ పరిధి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద 73, ప్రహ్లాదపురంలో 70.75 మి.మీ. వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా శనివారం విద్యా సంస్థలకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ సెలవు ప్రకటించారు. సాయంత్రానికి వర్షం తగ్గినా సముద్రం మీదుగా వస్తున్న గాలులకు చలి వాతావరణం నెలకొంది. వాయుగుండం బలహీనపడినా ఆదివారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరింంది.
కోకోనట్ ఎరీనాకు కోత ముప్పు
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
అలల తీవ్రతకు వారం రోజుల నుంచి సముద్ర తీరం భారీగా కోతకు గురవుతోంది. కురుసుర మ్యూజియం వెనుక భాగంలో రక్షణ గోడ చాలావరకూ ఇప్పటికే కూలిపోయింది. మ్యూజియం నుంచి ఉత్తరాన చిల్డ్రన్ పార్కు వరకూ కోత తీవ్రంగా ఉంది. శనివారం వైఎంసీఏ ఎదురుగా ఉన్న కోకోనట్ ఎరీనాలో చెట్లు కూడా కూలిపోయాయి. ఇంకా నోవాటెల్ హోటల్ వద్ద చిల్ట్రన్ పార్కు కూడా కోత ఎక్కువగా ఉంది.