విద్యార్థి మృతిపై కొనసాగిన ఆందోళన
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:39 AM
విద్యుదాఘాతంతో మృతి చెందిన గొలుగొండ ఎస్టీ బాలుర వసతి గృహ విద్యార్థి తూబిరి దావిద్ రాజ్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని రెండో రోజూ ఆందోళన కొనసాగింది. సోమవారం విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు, గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు.
ఆర్డీవో హామీతో శాంతించిన ఆందోళనకారులు
నర్సీపట్నం, ఫిబ్రవరి 5 : విద్యుదాఘాతంతో మృతి చెందిన గొలుగొండ ఎస్టీ బాలుర వసతి గృహ విద్యార్థి తూబిరి దావిద్ రాజ్ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని రెండో రోజూ ఆందోళన కొనసాగింది. సోమవారం విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు, గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. ఏఎస్‌డబ్ల్యూవో శ్యామల, గొలుగొండ ఎస్టీ బాలుర వసతి గృహం సంక్షేమ అధికారి అప్పారావులను ఆర్డీవో విచారించారు. ఈ సందర్భంగా విద్యుత్ వైర్లు సమస్యపై గత నెల 23 తేదీన గొలుగొండ ఏఈకి ఫిర్యాదు చేశామని వార్డెన్ ఆర్డీవో తెలిపారు. విద్యార్థులు మేడ మీదకు వెళ్లకుండా మెట్ల మార్గంలో ముళ్ల కంచె వేశామని తెలిపారు. అనంతరం ఎస్టీ, ఎస్టీ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సాయం, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం, సాగు భూమి, ఇంట్లో ఒకరికి ఉపాధి ఇవ్వడానికి ఆర్డీవో హెచ్‌వీ జయరాం హామీ ఇచ్చారు. ఏఎస్‌డబ్ల్యూవో శ్యామల, గొలుగొండ ఏపీ ఈపీడీసీఎల్ ఇన్‌చార్జ్ ఏఈ రాజేంద్రకుమార్, వసతి గృహ సంక్షేమ అధికారిమడ్డు అప్పారావులపై కలెక్టర్‌కి నివేదిక పంపామని తెలిపారు. అనంతరం ఏరియా ఆస్పత్రి వద్ద ఆందోళనకారుల వద్దకు ఆర్డీవో వెళ్లి రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. మిగిలిన హామీలకు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ ఎంపీపీ గజ్జల మణికుమారి, గిరిజన సంఘం నాయకులు గోవిందరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా జి. గీతా కృష్ణ, సీపీఎం నాయకులు అడిగర్ల రాజు, బీఎస్‌పీ ఇన్‌చార్జ్ నాగరాజు, విద్యార్థి సంఘం నాయకులు ఫణీంద్ర, రాధాకృష్ణ, దళిత సంఘాల నాయకులు నేతల నాగేశ్వరరావు, చిట్ల చలపతి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.