Share News

కొత్త గ్యాస్‌ గోదాము నిర్మాణం జరిగేనా?

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:38 AM

గిరిజన సహకార సంస్థ(జీసీసీ) మార్కెట్‌ యార్డు వద్ద అద్దెకు తీసుకున్న గ్యాస్‌ గోదాము శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఆరుబయట సిలిండర్లను భద్రపరుస్తూ రాత్రి, పగలు కాపలా కాయాల్సి దుస్థితి నెలకొంది.

కొత్త గ్యాస్‌ గోదాము నిర్మాణం జరిగేనా?
గోడ కూలిపోయిన జీసీసీ గ్యాస్‌ గోదాము

- ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం

- స్థలాన్ని కేటాయించినా నిర్మాణం ప్రారంభంకాని వైనం

- ప్రస్తుతం అద్దె భవనంలో ఉన్న గోదాము శిథిలావస్థకు..

- ఆరు బయటే సిలిండర్లను భద్రపరుచుకోవలసిన పరిస్థితి

చింతపల్లి, ఫిబ్రవరి 26: జీసీసీకి సొంత గోదాములు లేకపోవడం, ప్రత్యామ్నాయ గోదాములు అందుబాటులో లేకపోవడం వల్ల జీసీసీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీసీసీకి నూతన గ్యాస్‌ గోదాము నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఐదేళ్లుగా కార్యరూపం దాల్చక పోవడంతో అవస్థలు తప్పడం లేదు.

చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల్లో హెచ్‌పీసీఎల్‌ కంపెనీ గ్యాస్‌ పంపిణీ ఏజెన్సీ బాధ్యతలను గిరిజన సహకార సంస్థ తీసుకుంది. సుమారు 18 ఏళ్లుగా మూడు మండలాల్లో వినియోగదారులు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చింతపల్లి జీసీసీ ఏజెన్సీ ద్వారా గ్యాస్‌ పంపిణీ జరుగుతున్నది. గ్యాస్‌ సిలిండర్లు భద్రపరిచేందుకు జీసీసీకి సొంత గోదాములు అందుబాటులో లేవు. దీంతో జీసీసీ అధికారులు మార్కెట్‌ యార్డులోని ఒక గోదామును అద్దెకు తీసుకున్నారు. ఈ గోదాముకి ప్రతీ నెల జీసీసీ రూ.4,800 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. మూడు మండలాల్లో సుమారు 12 వేల గ్యాస్‌ కనెక్షన్లకు సంబంధించిన సిలిండర్లు చింతపల్లి గోదాములో భద్రపరుస్తున్నారు. అయితే ఎనిమిది నెలల కిందట ఈ గోదాము ముందు భాగం గోడ కూలిపోయింది. అలాగే పైకప్పు కూడా కిందకు జారిపోయింది. దీంతో జీసీసీ అధికారులు గోడ కూలిపోయిన గ్యాస్‌ గోదాములోని ఒక భాగానికి స్వల్ప మరమ్మతులు చేసుకుని ఐదు కిలోల సిలిండర్లను భద్రపరుస్తున్నారు. అత్యధిక సంఖ్యలో గ్యాస్‌ సిలిండర్లు ఆరుబయట భద్రపరుస్తూ వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారు. సిలిండర్లు అపహరణకు గురికాకుండా రాత్రివేళ వాచ్‌మన్‌ను కాపలా పెట్టారు. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్‌, జీసీసీ ఎండీ దృష్టికి స్థానిక డీఎం పి.దేవరాజు తీసుకు వెళ్లారు. నూతన గోదాము నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్టు జీసీసీ అధికారులు చెబుతున్నప్పటికి ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కాగా గ్యాస్‌ గోదామును వెంటనే నిర్మించే పరిస్థితి లేకపోవడంతో మార్కెట్‌ యార్డులో నిరుపయోగంగా ఉన్న మరో గోదాముకు మరమ్మతులు చేపట్టి అద్దెకు ఇవ్వాలని మార్కెట్‌ కమిటీ అధికారులను జీసీసీ అధికారులు కోరారు. అయితే మార్కెట్‌ కమిటీ వద్ద గోదాము మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన నిధులు లేవు. ఈ నేపథ్యంలో మరి కొంత కాలం జీసీసీ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

గ్యాస్‌ గోదాముకి 30 సెంట్ల స్థలం కేటాయింపు

చింతపల్లి మండల కేంద్రంలో గ్యాస్‌ గోదాము నిర్మించుకునేందుకు రెవెన్యూ అధికారులు 30 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారికంగా రెవెన్యూ అధికారులు జీసీసీకి అప్పగించారు. స్థలం అందుబాటులో ఉన్నప్పటికి భవన నిర్మాణం ప్రారంభం కాకపోవడంపై జీసీసీ గ్యాస్‌ నిర్వాహకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:38 AM