Share News

పశ్చిమలో ఓట్ల తొలగింపునకు కుట్ర

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:27 AM

ఓటరు జాబితాలో అనేక రకాల ప్రహసనాలు బయటపడుతున్నాయి.

పశ్చిమలో ఓట్ల తొలగింపునకు కుట్ర

ఒకటికి మించి ఫారం-7 దాఖలు చేసిన 163 మంది

4,875 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు

తప్పుడు ఫారాలు ఇచ్చిన అధికార పార్టీ నేతలు

ఓట్ల తొలగింపునకు అధికారుల యత్నాలు

ఎమ్మెల్యే గణబాబు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

నివేదిక సమర్పించినా చర్యలకు వెనుకడుగు

విశాఖపట్నం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):

ఓటరు జాబితాలో అనేక రకాల ప్రహసనాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డబుల్‌ ఎంట్రీలు, మృతుల ఓట్లతో జాబితాలు లోపభూయిష్టంగా రూపొందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోందనే వాదనా వినిపిస్తోంది. ఈ క్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపునకు జరిగిన కుట్ర బయటపడింది. నియోజకవర్గంలో అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువగా ఫారం-7 దరఖాస్తులు సమర్పించడం ప్రాధాన్యం సంతరించకుంది. దీనిపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గణబాబు లోతుగా వివరాలు సేకరించి గత నెలలోనే అధికారులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు పశ్చిమ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో హుస్సేన్‌సాహేబ్‌ చేపట్టిన విచారణ నివేదిక మేరకు బాఽధ్యులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.

గత ఏడాది అక్టోబరు 27న విడుదలచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో కొన్ని ఓట్లు తొలగించాలని అధికారపార్టీ నేతల సూచనలతో కిందిస్థాయి నాయకులు రంగంలోకి దిగా రు. బోగస్‌ ఓటర్లు ఉన్నారని పేర్కొంటూ ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువగా ఫారం-7 దాఖలుచేసి ఆయా ఓట్లను జాబితా నుంచి తొలగించాలని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి ఐదుకు మించి ఫారం- 7 దరఖాస్తులు చేయకూడదు. కానీ 163 మంది ఒక్కొక్కరు పది, అంతకంటే ఎక్కువగా మొత్తం 4,875 ఓట్లు తొలగిం చాలని దరఖాస్తుచేశారు. వీటిని పరిశీలించిన బూత్‌లెవెల్‌ అధికారులు 1,126 ఫారాలను తిరస్కరించారు. అయితే అర్హు లైన ఓటర్లను తొలగిస్తున్నారన్న సమాచారం మేరకు ఎమ్మెల్యే గణబాబు అప్రమత్తమై క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసు కునే ప్రయత్నం చేశారు.

అడ్డగోలుగా ఫారం7 దరఖాస్తులు

గోపాలపట్నంలో ఉంటున్న వ్యక్తులు మల్కాపురం, కంచరపాలెంలో నివసిస్తున్న వారి ఓట్లు, గోపాలపట్నం, మల్కాపురంలో ఉన్న వారు శ్రీహరిపురంలో ఉన్న వారి ఓట్లు తొలగించాలని ఫారం-7 దరఖాస్తు చేసినట్టు ఎమ్మెల్యే పరిశీలనలో బయటపడింది. అధికారపార్టీ కీలకనేత కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు కూడా లెక్కకు మించి ఫారం-7 దాఖలు చేశారని నిర్ధారించుకున్నారు. విపక్షపార్టీకి చెందిన ఓట్లను తొలగించాలని ఏఈఆర్వోలపై అధికారపార్టీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారని కూడా తెలుసుకున్నారు. అంతేకాకుండా బీఎల్‌వోలకు ఏఈఆర్వోలు రంగంలోకి దిగి అధికారపార్టీ నేతలు సూచించిన మేరకు ఫారం-7 దరఖాస్తులు తీసుకుని, ఓట్లు తొలగించాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఫారం- 7 దరఖాస్తు వివరాలు సేకరించి రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌, ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌కు ఫిర్యాదుచేశారు.

చర్యలపై మీనమేషాలు

ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎవరైనా వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఫారం-7 దరఖాస్తు చేసినట్టు తేలితే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే గణబాబు ఇచ్చిన ఫిర్యాదుపై రిటర్నింగ్‌ అధికారి విచారించి, ఫారం-7 తప్పుడు దరఖాస్తులు ఇచ్చారని నిర్థారించినట్టు తెలిసింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వారు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ ఫారం 7 అక్రమాలు

విశాఖ పశ్చిమలో బూత్‌ నంబరు 204కు చెందిన నూకరాజు అనే వ్యకి పక్కనున్న బూత్‌నంబరు 203లో ఉంటున్న 144 మంది ఓట్లు తొలగించాలని ఫారం-7 దాఖలు చేశారు. దీంట్లో 40 దరఖాస్తులను బీఎల్‌వోలు తిరస్కరించారు. ఇదే బూత్‌కు చెందిన పెంటారావు బూత్‌ నంబరు 89లో 122 ఓట్లను తొలగించాలని దరఖాస్తు చేశారు. బూత్‌ నంబరు 53లో కె.రవి తనకు సంబంధంలేని బూత్‌ నంబరు రెండు నుంచి 215 వరకు మొత్తం 28 బూత్‌లలో ఉన్న 106మంది ఓట్లు తొలగింపునకు దరఖాస్తు చేస్తే 76 దరఖాస్తులను బీఎల్వోలు తిరస్కరించారు. బూత్‌ నంబరు 105లో ఉంటున్న సన్యాసిరావు 103,105 బూత్‌లలో 106 ఓట్లు, బూత్‌ నంబరు 93కు చెందిన మోహబూబ్‌ 98, 105, 106 బూత్‌లలో 86 ఓట్లు, బూత్‌ నంబరు 180లో ఉన్న సత్యవతి సుమారు 20 బూత్‌లలో ఉన్న 72 మంది ఓట్లు తొలగించాలని దరఖాస్తు చేశారు. ఈ విధంగా 70 మంది వరకు పాతిక కంటే ఎక్కువగా, మిగిలిన వారంతా పదికంటే ఎక్కువగా ఫారం-7 దాఖలు చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 01:27 AM