Share News

వైసీపీలో గందరగోళం

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:12 AM

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరనే దానిపై ఆ పార్టీ నాయకుల్లో గందరగోళం మరింత పెరుగుతున్నది.

వైసీపీలో గందరగోళం

ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు తుది అభ్యర్థులు కాదంటున్న వైవీ సుబ్బారెడ్డి

వచ్చే నెల మూడో తేదీ తర్వాతే జాబితా ప్రకటిస్తామని వెల్లడి

ఆశావహులతోపాటు నేతలు, కార్యకర్తల్లో ఆందోళన

ఇప్పటికే 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, జనసేన కూటమి

ఇంకా వేచి చూసే ధోరణిలోనే వైసీపీ అధిష్ఠానం

విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్న నేతలు, కార్యకర్తలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎవరనే దానిపై ఆ పార్టీ నాయకుల్లో గందరగోళం మరింత పెరుగుతున్నది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఫైనల్‌ కాదని, వచ్చే నెల మూడో తేదీ తరువాతే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమి దాదాపు వంద మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కదన రంగంలోకి దిగుతుండగా... ఇంకా అభ్యర్థులను ప్రకటించడానికే సమయం పట్టేలా ఉందని వైసీపీ అగ్రనేతలు చెబుతున్నారు. ఇది వైసీపీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కిందిస్థాయి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ.... అత్యధిక సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలుగుదేశం, జనసేన పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు నిర్వహించింది. గెలుపు అవకాశాల్లేవని గుర్తించిన సమన్వయకర్తలను తొలగించి, సమర్థులుగా భావించిన వారిని నియమించింది. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించింది. మరికొందరు ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు మార్చి, వారి స్థానంలో కొత్తవారిని నియమించింది.

మార్పులతో తంటాలు

విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న అక్కరమాని విజయనిర్మలకు ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదనే కారణంతో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను సమన్వయకర్తగా వైసీపీ నియమించింది. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పనితీరు సరిగా లేదంటూ కార్పొరేటర్‌ ఉరుకూటి రామచంద్రరావును నియమించింది. దీనిపై ఎమ్మెల్యే నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేయడంతో పాటు ఉరుకూటికి తప్ప మరెవరికి అవకాశం ఇచ్చినా అభ్యంతరం లేదని బాహాటంగానే స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో సమన్వయకర్తగా ఉన్నంతమాత్రాన పార్టీ టికెట్‌ ఖరారైనట్టు కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానిస్తుండడం ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నది.

అనకాపల్లి ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కాదని పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించింది. తానే అభ్యర్థినంటూ ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ని మార్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అతని స్థానంలో పలువురి పేర్లు తెరమీదకి వస్తున్నాయి. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి నియోజకవర్గంలో అసమ్మతిపోరు ఎక్కువైంది. పార్టీలోని కొంతమంది నేతలు, కార్యకర్తలు ధర్మశ్రీకి టికెట్‌ ఇవ్వొద్దంటూ మీడియా సమావేశాలు పెట్టి మరీ స్పష్టం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఎమ్మెల్యేగా శెట్టి ఫాల్గుణ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎంపీ గొడ్డేటి మాధవిని నియమించారు. దీనిపై మండల స్థాయి నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడంతో పార్టీ పెద్దలు ఆమె (మాధవి) స్థానంలో హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగాన మత్సలింగంని నియమించారు. పాడేరు ఎమ్మెల్యేగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఉండగా.. నియోజకవర్గ సమన్వయకర్తగా మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమించారు.

వైవీ వ్యాఖ్యలతో కలకలం

ఇదిలావుండగా కొత్తగా సమన్వయకర్తలుగా నియమితులైన వారికి, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే సమన్వయకర్తలుగా ఉన్న వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఖాయమనే భావన కార్యకర్తల్లో ఉంది. వారంతా తమ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులమనే నమ్మకంతో ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ తరుణంలో శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను కలవరపాటుకి గురిచేశాయి. అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలపై అసమ్మతి వున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో టికెట్‌ ఎవరికి వస్తుందో తెలియక నేతలు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుండగా... అభ్యర్థులు ఎవరన్న దానిపై స్పష్టత లేక వైసీపీ శ్రేణులు నిరుత్సాహంలో కూరుకుపోయాయి.

Updated Date - Feb 26 , 2024 | 01:12 AM