Share News

మండుటెండలో అవస్థలు

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:58 PM

మండలంలో మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో కనీస సదుపాయాలు లేక ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. టెంట్లు, మంచినీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నారు.

మండుటెండలో అవస్థలు
బంగారుమెట్ట వద్ద చెట్ల కింద కూర్చొని ఉపశమనం పొందుతున్న ఉపాధి కూలీలు

ఉపాధి పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు శూన్యం

కూలీలకు తప్పని ఇబ్బందులు

పెదబయలు, మార్చి 24: మండలంలో మహాత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో కనీస సదుపాయాలు లేక ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. టెంట్లు, మంచినీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. మండలంలోని 23 పంచాయ తీల్లో గల పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. భూమి చదును, మొక్కలు నాటడానికి గోతులు తీయడం, చెరువులు తవ్వడం, రాతి కట్లు వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఆదివారం సీకరి పంచాయతీ బంగారుమెట్ట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పని ప్రదేశంలో ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ఠారెత్తిస్తున్న ఎండ నుంచి రక్షణ పొందడానికి కూలీలు చెట్ల కింద కొంత సేపు సేదతీరారు. పని ప్రదేశంలో టెంట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోయారు. గతంలో పారలు, గునపాలు వంటి పనిముట్లను ప్రభుత్వం సరఫరా చేసేదని, ఇప్పుడు అవి కూడా అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉపాది పని జరిగే ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, పని ముట్లు సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:58 PM