ఉద్యోగిని మృతిపై ఆందోళన
ABN , Publish Date - Jul 29 , 2024 | 11:19 PM
తీయనయూన్ గార్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న నక్కా మాధురి(19) యాజమాన్యం వేధింపుల వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు, తోటి ఉద్యోగులు సోమవారం బ్రాండిక్స్ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు.
తీయనయూన్ గార్మెంట్స్ యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపణ
బ్రాండిక్స్ గేటు వద్ద కుటుంబ సభ్యులు, కర్మాగారంలో తోటి కార్మికుల నిరసన
అచ్యుతాపురం, జూలై 29: తీయనయూన్ గార్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న నక్కా మాధురి(19) యాజమాన్యం వేధింపుల వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు, తోటి ఉద్యోగులు సోమవారం బ్రాండిక్స్ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించడంతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రొంగలి రాము డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, తోటి ఉద్యోగులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మునగపాక మండలం అరబుపాలేనికి చెందిన మాధురి బ్రాండిక్స్ ఆవరణలో గల తీయనయూన్ గార్మెంట్స్ కర్మాగారంలో నాలుగురోజుల క్రితం నుంచి విధులకు హాజరవుతోంది. అయితే గత శుక్రవారం ఆమె విధుల్లో ఉండగా వాష్‌రూమ్‌కి వెళ్లి ఆలస్యంగా వచ్చిందన్న నెపంతో కర్మాగారం ప్రతినిధులు ఆమెను తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాక కర్మాగారం ప్రధాన గేటు వరకు తీసుకువచ్చి వదిలేశారు. తన గ్రామానికి వెళ్లడానికి ఖర్చులకు కూడా డబ్బులు లేవని, ఏదైనా వాహనంపై తన గ్రామానికి పంపాలని మాధురి వేడుకున్నా సిబ్బంది వినిపించుకోలేదు. ఏదో విధంగా మాధురి తన ఇంటికి చేరుకొని తీవ్ర మనస్తాపానికి గురై శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆదివారం ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. సోమవారం బ్రాండిక్స్ ప్రధాన గేటు వద్ద మాధురి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు. అలాగే సోమవారం ఉదయం నుంచి బ్రాండిక్స్ ఆవరణలో కర్మాగారం వద్ద తోటి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినా యాజమాన్యం ఈ విషయం బయటకు పొక్కకుండా మేనేజ్ చేస్తున్నారని, కర్మాగారం వద్ద ఆందోళన చేస్తున్న వారిని కూడా బయటకు పంపడం లేదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రాము ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన
అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు సోమవారం ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు రేబాక మధుబాబు, దళిత సంఘాల నాయకులు బోను గణేశ్, లంబ శ్రీను, రాజాన దొరబాబు, తట్టా సూరిబాబు, రాజు, బిల్లా శివ గణేశ్, జంప సీతారాం, తదితరులు పాల్గొన్నారు.