Share News

సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:11 AM

తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, కేజీబీవీ టీచర్లను ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయిలో సెక్టోరియల్‌ అధికారుల వరకూ బెదిరిస్తున్నారు.

సమగ్ర శిక్ష ఉద్యోగులకు నోటీసులు

విశాఖ జిల్లాలో 120 మందికి...

అనకాపల్లిలో కేజీబీవీ టీచర్లను తొలగిస్తున్నట్టు ప్రిన్సిపాళ్లకు సమాచారం?

నేటి ‘చలో విజయవాడ’కు వెళ్లొద్దని అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి

విశాఖపట్నం, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):

తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండు వారాల నుంచి సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, కేజీబీవీ టీచర్లను ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయిలో సెక్టోరియల్‌ అధికారుల వరకూ బెదిరిస్తున్నారు. విధులకు హాజరుకాకుంటే తొలగిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాలోని మూడు కేజీబీవీల్లో 40 మంది టీచర్లు గురువారం విధుల్లో చేరారు. శుక్రవారం నుంచి కొత్తవారితో బోధన చేయిస్తామని భయపెట్టడంతో విధిలేక వారంతా డ్యూటీలో చేరారని సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ నేత ఒకరు పేర్కొన్నారు. ఇదిలావుండగా సమగ్రశిక్ష జిల్లా కార్యాలయం, మండల విద్యాశాఖాధికారి కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు 120 మందికి గురువారం విశాఖ జిల్లా అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ బి.శ్రీనివాసరావు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. వారం రోజుల్లో విధులకు హాజరుకావాలంటూ 120 మందికీ పేరు పేరునా నోటీసులు ఇచ్చారు.

ఇదిలావుండగా అనకాపల్లి జిల్లాలో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేసే సీఆర్‌టీ (టీచర్లు)లు విధులకు హాజరుకావడం లేదు. వారందరికీ వారం క్రితమే షోకాజ్‌ నోటీస్‌ జారీచేసినా కొద్దిమంది తప్ప మిగిలిన వారెవరూ విధులకు హాజరుకాలేదు. విధులకు రాని సీఆర్‌టీలకు తొలగించాలని విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు విధుల నుంచి తొలగించినట్టు నోటీసులను నేరుగా సీఆర్‌టీలకు కాకుండా సంబంఽధిత కేజీబీవీ ప్రిన్సిపాళ్ల వాట్సాప్‌లకు పంపారని చెబుతున్నారు.

చలో విజయవాడకు ఉద్యోగులు

విజయవాడలోని సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించాలని జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగానే ఉద్యోగులు బయలుదేరారు. అయితే విజయవాడ వెళ్లవద్దని సమగ్రశిక్ష అభియాన్‌ అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నట్టు జేఏసీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:11 AM