Share News

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - May 29 , 2024 | 01:21 AM

విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎ.మల్లికార్జున తెలిపారు.

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మల్లికార్జున

పార్లమెంట్‌ అభ్యర్థులు, రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం

కౌంటింగ్‌ సాఫీగా సాగేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి

మహారాణిపేట, మే 28:

విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎ.మల్లికార్జున తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఈ ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులకు ఓట్లు లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పోస్టల్‌ బ్యాలెట్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు, కౌంటింగ్‌ టేబుళ్ల ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, ఏజెంట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, చట్టపరమైన అంశాలను కలెక్టర్‌ వివరించారు. కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. ఓట్లు లెక్కింపునకు 104 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్ల కోసం 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈనెల 31వ తేదీ నాటికి ఏజెంట్ల వివరాలు అందజేయాలన్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఉంటుందని, తరువాత ఈవీఎంలు లెక్కిస్తారని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించబోమన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఏజెంట్లు వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌లో 13ఏ, 13బీ ఫారాలు ఉంటాయని, వాటిపై కచ్చితంగా ఓటరు సంతకంతో పాటు అధికారి సంతకం, హోదా ఉండాలన్నారు. అవి లేని ఓటు చెల్లదని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, ఇతర అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 01:21 AM