Share News

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకు పోటీ

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:12 AM

కేజీహెచ్‌కు పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో పలువురు సీనియర్‌ వైద్యులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకు పోటీ

ఇద్దరికి ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్‌ మంత్రి సిఫారసు లేఖలు

అందులో ఒకరు గతంలో వైసీపీ ముఖ్య నాయకులతో సన్నిహితంగా మెలగారనే విమర్శలు

పోటీలో మరో ముగ్గురు....

నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల ద్వారా ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద ప్రయత్నం

విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌కు పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న ప్రచారం నేపథ్యంలో పలువురు సీనియర్‌ వైద్యులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇద్దరు సీనియర్‌ వైద్యులకు ఉత్తరాంధ్రకు జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ మంత్రి సిఫారసు లేఖలు ఇచ్చినట్టు చెబుతున్నారు. వీరిలో ఒకరు శ్రీకాకుళం జిల్లాలో, మరొకరు ఆంధ్ర మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్నారు. అయితే, వారిద్దరిలో ఒకరికి లేఖ ఇవ్వడంపై మాత్రం వైద్య వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సన్నిహితంగా మెలిగిన వారికి కూటమి ప్రభుత్వంలో సిఫారసు లేఖ ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జులుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చుట్టూ తిరిగిన వారికి సిఫారసు లేఖ ఎలా ఇస్తారంటూ కూటమి ప్రభుత్వానికి సానుభూతిపరులుగా ఉన్న కొందరు వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకు పలువురు వైద్యులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇక, మరో మంత్రి, స్పీకర్‌ ద్వారా మరో ఇద్దరు వైద్యులు సూపరింటెండెంట్‌ పోస్టు కోసం యత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుత సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానంద కూడా నగర పరిధిలోని ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేల ద్వారా తన ప్రయత్నాలను చేసుకుంటున్నారు. ప్రస్తుతం శివానంద అదనపు పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 01:12 AM