Share News

పరిహారం ప్లాట్లు గంగపాలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:03 AM

మండలంలోని పైడివాడఅగ్రహారం గ్రామంలో జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు ముంపునకు గురికావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై మూడేళ్లుగా అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు.

పరిహారం ప్లాట్లు గంగపాలు
పైడివాడఅగ్రహారంలో నీట మునిగిన రైతులకు ఇచ్చిన పరిహారం ప్లాట్లు

- జగనన్న కాలనీకి భూములిచ్చిన రైతులు గగ్గోలు

- ముంపు ప్రాంతంలో స్థలాలిచ్చి గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన

సబ్బవరం, జూలై 27: మండలంలోని పైడివాడఅగ్రహారం గ్రామంలో జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ప్లాట్లు ముంపునకు గురికావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీనిపై మూడేళ్లుగా అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు.

పైడివాడ, పైడివాడఅగ్రహారం, ఎరుకునాయుడుపాలెం గ్రామాల పరిధిలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ కోసం రైతుల సాగులో ఉన్న డీ పట్టా, ప్రభుత్వ భూములు 320 ఎకరాలను సమీకరించింది. పరిహారం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పింది. అయితే పరిహారం ప్లాట్లను గెడ్డలు, వాగులు ప్రవహించే మార్గంలో అభివృద్ధి చేస్తుండడంతో అప్పట్లో రైతులు వ్యతిరేకించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల పూర్తిగా ముంపు ప్రాంతంలో ప్లాట్లు అభివృద్ధి చేశారు. ముందుగా రోడ్లు అభివృద్ధి కోసం గెడ్డ ప్రవాహానికి అడ్డుగా గ్రావెల్‌ వేశారు. తాజాగా కురిసిన వర్షాలకు ప్లాట్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ముంపు ప్రాంతంలో తమకు పరిహారం ప్లాట్లు వద్దని మొత్తుకుంటున్నా వీఎంఆర్‌డీఏ అధికారులు వినకుండా అక్కడే ఇచ్చారని రైతులు అక్కిరెడ్డి దుర్గినాయుడు, బొబ్బరి కన్నారావు, గొంతిన పైడిరాజు తదితరులు వాపోతు న్నారు. వరదలో కొట్టుకుపోవడం వల్ల తమ ప్లాట్లు ఎవరూ కొనుగోలు చేయరని, దీని వల్ల తమకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తమకు వేరే చోట పరిహారం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:03 AM