Share News

వరద ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:25 PM

జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చింతూరు, కూనవరం మండలాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదివారం పర్యటించారు.

వరద ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటన
ముంపు ప్రాంతాలకు బోటులో వెళుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు

బాధితుల సహాయక, పునరావాస చర్యలపై ఆరా

సంపూర్ణ సాయం అందాలని అధికారులకు ఆదేశం

పాడేరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని చింతూరు, కూనవరం మండలాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదివారం పర్యటించారు. చింతూరు మండలం గొల్లగుప్ప, వీరపురం, కూనవరం మండలంలో భద్రాయగూడెం, తాళ్లగూడెం గ్రామాలను సందర్శించి, ఆయా ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం భద్రాయగూడెం, తాళ్లగూడెం గ్రామాలు నీటి మునిగి ఉండడంతో బోటులో ప్రయాణించి వరద బాధితుల వద్దకు చేరుకున్నారు. ఆయా గ్రామాల్లో వరద బాధితులకు అందుతున్న సహాయం, తదితర సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు అందించిన సరకులు, ఇతర సామగ్రిని పరిశీలించి, అధికారుల సేవలపై ఆరా తీశారు. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలన్నారు. అలాగే అన్ని ప్రాంతాల్లోని బాధితులకు సంపూర్ణ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బందిని నియమించామని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. వరదలు తగ్గుతుప్పటికీ ముంపు ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఆయా ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అదే ప్రాంతంలో ఓ బాధిత కుటుంబం ఏర్పాటు చేసుకుంటున్న తాత్కాలిక నివాసాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే ముంపు ప్రాంతాల్లో అవసరాలకు వినియోగించుకునేందుకు బోట్లున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అధికారులు, ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సూరజ్‌గనోరే, కావూరి చైతన్య, తహసీల్దార్‌ నజీముల్లా, సీడీపీవో గౌరి, ఎంపీడీవో రవిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 11:25 PM