Share News

నిరుద్యోగుల కలెక్టరేట్‌ ముట్టడి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:26 PM

గిరిజన స్పెషల్‌ డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాల్‌దేవ్‌, డీఎస్‌సీ సాధన సమితి కన్వీనర్‌ నరేశ్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

నిరుద్యోగుల కలెక్టరేట్‌ ముట్టడి
కలెక్టరేట్‌లో బైఠాయించిన గిరిజన నిరుద్యోగులు

గిరిజన స్పెషల్‌ డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌

పాడేరు, మార్చి 4(ఆంధ్రజ్యోతి): గిరిజన స్పెషల్‌ డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాల్‌దేవ్‌, డీఎస్‌సీ సాధన సమితి కన్వీనర్‌ నరేశ్‌ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేస్తుందన్నారు. సాధారణ డీఎస్‌సీ నోటిఫికేషన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే, అందులో రాష్ట్రంలో గిరిజనులకు 517 పోస్టులు కేటాయిస్తే, అల్లూరి జిల్లాలోని గిరిజనులకు కేవలం 7 పోస్టులు మాత్రమే దక్కుతున్నాయన్నారు. జిల్లాలో వేలాది మంది గిరిజన నిరుద్యోగులు డీఎడ్‌, బీఎడ్‌ పూర్తి చేసి ఉన్నారని, ప్రస్తుతం డీఎస్‌సీ నోటిఫికేషన్‌లో నామమాత్రంగా పోస్టులుండడంతో గిరిజనులు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. శతశాతం గిరిజన అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కేలా గిరిజన ప్రత్యేక డీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని సురేంద్ర డిమాండ్‌ చేశారు. తాజా డీఎస్‌సీ నోటిఫికేషన్‌లో షెడ్యూల్‌ ప్రాంతంలో శతశాతం ఉన్న గిరిజనులకు 5 శాతం ఉద్యోగాలు, కేవలం 5 శాతం జనాభా వున్న ఇతరులకు 95 శాతం ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిణామం గిరిజన నిరుద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందన్నారు. ప్రధానంగా జీవో:3 రద్దు కారణంగానే గిరిజనులు ఈ విధమైన అన్యాయానికి గురవుతున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నెల 9లోగా గిరిజన స్పెషల్‌ డీఎస్‌సీకి నోటిఫికేషన్‌ జారీ చేయకుంటే 10న మన్యం బంద్‌ చేపడతామని ప్రకటించారు.

కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్న నిరుద్యోగులు

కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన సంఘం కార్యాలయం నుంచి సుమారుగా కిలోమీటరున్నర దూరంలో ఉన్న కలెక్టరేట్‌కు గిరిజన సంఘం, డీఎస్‌సీ సాధన సమితి ప్రతినిధులు, గిరిజన నిరుద్యోగులు ర్యాలీగా చేరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి పి.శాంతికుమారి ర్యాలీలో పాల్గొని ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. కలెక్టరేట్‌కు చేరుకున్న నిరుద్యోగులు అక్కడ బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈసందర్భంగా తమ డిమాండ్లపై స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి.అంబేడ్కర్‌కు ఆందోళనకారులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ధర్మన్నపడాల్‌, నేతలు బుజ్జిబాబు, ఎం.ఎం.శ్రీను, చిట్టిబాబు, మాతృభాషా వలంటీర్ల సంఘం నేతలు చిట్టిబాబు, కుమారి, శ్రీను, చంద్రయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు జీవన్‌, కార్తిక్‌, సింహాద్రి, డీఎస్‌సీ సాధన సమితి కోకన్వీనర్లు ఉపేంద్ర, బొంజిబాబు, అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:26 PM