Share News

మళ్లీ తెరపైకి కోస్టల్‌ కారిడార్‌

ABN , Publish Date - Nov 10 , 2024 | 01:07 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షతో పాత ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ మళ్లీ తెరపైకి వచ్చాయి.

మళ్లీ తెరపైకి కోస్టల్‌ కారిడార్‌

  • కంటెయినర్‌ టెర్మినల్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 55 కిలోమీటర్ల మేర ఆరు వరుసల్లో రహదారి

  • ప్రాజెక్టు వ్యయం రూ.6,289 కోట్లు

  • రూ.1.45 కోట్లతో తయారవుతున్న డీపీఆర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నం జిల్లా అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్షతో పాత ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇందులో కోస్టల్‌ కారిడార్‌ ఒకటి. జాతీయ రహదారి-16కి సమాంతరంగా విశాఖపట్నం పోర్టు కంటెయినర్‌ టెర్మినల్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం జాతీయ రహదారి-16 వరకు ఆరు వరుసల్లో కోస్టల్‌ కారిడార్‌ నిర్మించాలనేది ప్రతిపాదన. గత ఏడాదే దీనికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థకు రూ.1.45 కోట్లు మంజూరు చేశారు. దీనిని త్వరగా పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

విశాఖపట్నం పోర్టు కంటెయినర్‌ టెర్మినల్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు తీరాన్ని ఆనుకొని 55 కి.మీ. పొడవున ఆరు వరుసల్లో కారిడార్‌ నిర్మించాలనేది ప్రణాళిక. దీనికి రూ.6,289 కోట్లు అవసరం అని అంచనా వేశారు. కారిడార్‌లో రెండు వైపులా పది మీటర్ల గ్రీన్‌ బెల్ట్‌ నిర్వహించాలని ప్రతిపాదించారు. లాజిస్టిక్‌ పార్కులు, పర్యాటక ఆకర్షక ప్రాజెక్టులు ఇందులో భాగం చేయాలని సీఎం సూచించారు. భీమిలి నుంచి భోగాపురం మధ్య ఈ కారిడార్‌ కోసం 346 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. కంగవానిపాలెం, అన్నవరం, మూలకద్దు, ఆ పొరుగునే ఉన్న మరో ఆరు గ్రామాల్లో ఈ భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అప్పట్లో జరిగిన చర్చల మేరకు కొన్ని అంగీకారాలు కుదిరాయని జిల్లా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.

- ఈ ప్రాజెక్టుకు భూ సేకరణకు రూ.4,315 కోట్లు, నిర్మాణాలకు రూ.1,974 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.

- భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లు భరించడానికి ఒప్పుకొంది. మిగిలిన మొత్తం కేంద్రం పెట్టుకోవాలి.

- నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్‌, స్టీల్‌పై జీఎస్‌టీ మినహాయింపు

త్వరలోనే డీపీఆర్‌ పూర్తి

ఈ కోస్టల్‌ కారిడార్‌ డీపీఆర్‌కు గత ఏడాది ఆగస్టులోనే రూ.1.45 కోట్లు మంజూరుచేశారని, ప్రస్తుతం డీపీఆర్‌ తయారు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి చేసి కేంద్రానికి సమర్పిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సమావేశంలో వెల్లడించారు. ఇది పూర్తయితే కేంద్ర ప్రతినిధులతో చర్చించి, ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళతామని సీఎం పేర్కొన్నారు.

ఇదిలావుండగా వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని నాటి కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇందులో భీమునిపట్నం నుంచి భోగాపురం వరకు 19.66 కి.మీ. పొడవున గ్రీన్‌ ఫీల్ట్‌ కారిడార్‌ వేయాలని నిర్ణయించారు. అయితే భీమిలి తీరం మీదుగా ఈ కారిడార్‌ వెళ్లాల్సి ఉండగా పట్టణంలో పురాతన కట్టడాలు కూల్చాల్సి వస్తుందని చెప్పి కారిడార్‌ మలుపు తిప్పారు. ఈ మార్గంలో వైసీపీ నాయకులు కొన్ని వందల ఎకరాలు సొంతం చేసుకున్నారు.

Updated Date - Nov 10 , 2024 | 01:07 AM