Share News

అరకు పార్లమెంట్‌లో కూటమి హవా

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:32 AM

అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో కూటమి హవా చాటింది. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఐదు గెలుచుకోగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గత రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అరకులోయ ఎంపీతో సహా మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ తాజా ఎన్నికల్లో అందుకు భిన్నమైన పరిస్థితిని వైసీపీ చవిచూసింది.

అరకు పార్లమెంట్‌లో కూటమి హవా

- సాలూరు, రంపచోడవరం, కురుపాం, పాలకొండ, పార్వతీపురం అసెంబ్లీ స్థానాల్లో విజయం

- పాడేరు, అరకులోయ స్థానాలకే వైసీపీ పరిమితం

- టీడీపీ సూపర్‌ సిక్స్‌, కూటమి కృషి, వైసీపీపై వ్యతిరేకతే ఈ మార్పునకు కారణం

- ఇన్నాళ్లు వైసీపీకి కంచుకోటగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఊహించని ఫలితం

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో కూటమి హవా చాటింది. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కూటమి అభ్యర్థులు ఐదు గెలుచుకోగా, వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గత రెండు దఫాలు జరిగిన ఎన్నికల్లో అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలో వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. అరకులోయ ఎంపీతో సహా మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ తాజా ఎన్నికల్లో అందుకు భిన్నమైన పరిస్థితిని వైసీపీ చవిచూసింది.

అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్వతీపురం ఎస్‌సీ రిజర్వుడు కాగా, మిలిగిన రంపచోడవరం, పాడేరు, అరకులోయ, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్‌టీ రిజర్వుడు. అయితే వాటిలో అరకులోయలో బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు, పాలకొండ స్థానంలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ, టీడీపీ అభ్యర్థులుగా రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి, పాడేరులో గిడ్డి ఈశ్వరి, కురుపాంలో తొయ్యాక జగదీశ్వరి, సాలూరులో గుమ్మడి సంధ్యారాణి బరిలో దిగారు.

ఐదు ఎమ్మెల్యే స్థానాలు కూటమి కైవసం

అరకులోయ పార్లమెంట్‌ స్థానం పరిధిలో రంపచోడవరం, సాలూరు, కురుపాం, పాలకొండ, పార్వతీపురం అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. రంపచోడవరంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరిషాదేవీకి 90,087 ఓట్లు రాగా, ప్రత్యేర్థి వైసీపీ అభ్యర్థి నాగులాపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు దక్కాయి. దీంతో 9,139 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే పాలకొండలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు 75,208 ఓట్లు, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వి.కళావతికి 61,917 ఓట్లు రావడంతో 13,291 ఓట్ల మెజార్టీతో జనసేన అభ్యర్థి గెలుపొందారు. కురుపాంలో టీడీపీ అభ్యర్థి తొయ్యాక జగదీశ్వరికి 81,186, వైసీపీ అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణికి 59,260 ఓట్లు దక్కడంతో 21,926 ఓట్ల ఆధిక్యతతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయకుమార్‌కు 79,625 ఓట్లు, వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుకు 56,744 ఓట్లు రావడంతో 22,881 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయకేతనం ఎగురవేశారు. సాలూరులో టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి 80,211 ఓట్లు, ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకు 66,478 ఓట్లు రావడంతో టీడీపీ అభ్యర్థి సంధ్యారాణి 13,733 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీ అరకులోయ ఎమ్మెల్యే అభ్యర్థి పాంగిరాజావుకు 32,93 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగంకు 64,983 ఓట్లు రావడంతో వైసీపీ అభ్యర్థి 32,050 ఓట్ల మెజార్టీ సాధించగా, పాడేరు వైసీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు 67,333 ఓట్లు, టీడీ పీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 47,468 ఓట్లు దక్కాయి. దీంతో వైసీపీ అభ్యర్థి 19,865 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే గత రెండు ఎన్నికల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు వైసీపీవి కాగా, తాజా ఎన్నికల్లో ఆ సంఖ్య రెండుకే పరిమితం కావడం గమనార్హం. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్‌ సిక్స్‌, కూటమి శ్రేణుల కృషి, వైసీపీ ప్రజావ్యతిరేక పాలనపై విసుగెత్తిన జనం కూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చారు. వైసీపీ కంచుకోటగా భావించే గిరిజన ప్రాంతంలో కూటమి అభ్యర్థులు వియదుందుభి మోగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jun 05 , 2024 | 01:32 AM