సీఎం పర్యటన.. ప్రజల పాట్లు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:48 AM
ఈ నెల 7వ తేదీన పిసినికాడలో చేయూత పథకం నిధుల విడుదల సభలో సీఎం పాల్గొంటారు. అయితే కశింకోట మండల కేంద్రంలో ప్రజలకు రెండు రోజుల ముందే తిప్పలు మొదలయ్యాయి. మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అడ్డుగా వున్న విద్యుత్ లైన్లు మార్చేందుకు మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం విద్యుత్ వైర్లు మార్పు
కశింకోటలో ఉదయం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిపివేత
ఎండవేడి, ఉక్కపోతతో జనం తిప్పలు
నిరుపయోగ భవనాలకు రంగులు
కశింకోట, మార్చి 5: ‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకొచ్చిందన్న’ చందంగా వుంది అనకాపల్లి వాసులకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పర్యటన. ఈ నెల 7వ తేదీన పిసినికాడలో చేయూత పథకం నిధుల విడుదల సభలో సీఎం పాల్గొంటారు. అయితే కశింకోట మండల కేంద్రంలో ప్రజలకు రెండు రోజుల ముందే తిప్పలు మొదలయ్యాయి. మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అడ్డుగా వున్న విద్యుత్ లైన్లు మార్చేందుకు మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విధించారు. సాయంత్రం ఆరు గంటల తరువాత ప్రాంతాల వారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా లేకపోవడం, దీనిపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎండ మండిపోవడంతో ఇళ్లల్లో ఉక్కపోతతో సతమతం అయ్యారు.
నిరుపయోగ భవనాలకు రంగులు!
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కశింకోట మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి చుట్టూ మండల పరిషత్ కార్యాలయం, బీసీ హాస్టల్, ఎంఆర్‌సీ భవనం, పౌరసరఫరాల సంస్థ గోదాము, తదితర భవనాలు వున్నాయి. వీటిన్నింటికీ ఆయా శాఖల అధికారులు హడావుండిగా రంగులు వేయిస్తున్నారు. వీటిల్లో పౌరసరఫరాల సంస్థ గోదాము, రెవెన్యూ కార్యాలయం రికార్డుల గది చాలా కాలం నుంచి నిరుపయోగంగా వున్నాయి. వీటికి కూడా రంగులు వేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరి ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని ప్రభుత్వ భవనాలుఎన్నో వున్నాయని, వాటిని బాగు చేయించకుండా పాత భవనాలకు రంగులు వేయించడంపై విస్మయం చెందుతున్నారు. ఇదిలావుండగా సభ ప్రాంగణానికి సమీపంలో ఉన్న ప్రైవేటు స్థలాలను తమ అనుమతులు లేకుండా చదును చేస్తున్నారని ఆయా యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.