సీఎం నోట అదే పాట
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:13 AM
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత మూడేళ్లుగా ఏ వేదిక ఎక్కినా...‘విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నా...మీరు కూడా రండి’...అంటూ చెబుతూ వస్తున్నారు.

విశాఖపట్నం వచ్చేస్తా... మూడేళ్లుగా ఇదే వరుస
అదిగో, ఇదిగో...అంటున్న పార్టీ నేతలు
తాజా ప్రకటన వెనుక రాజకీయ వ్యూహం
త్వరలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనంటున్న రాజకీయ విశ్లేషకులు
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గత మూడేళ్లుగా ఏ వేదిక ఎక్కినా...‘విశాఖపట్నానికి షిఫ్ట్ అవుతున్నా...మీరు కూడా రండి’...అంటూ చెబుతూ వస్తున్నారు. తన కేబినెట్‌లోని మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్టి, స్థానిక ఎమ్మెల్యేలతో ఇదే మాట పదేపదే చెప్పిస్తున్నారు. తాజాగా మంగళవారం నగరంలోని రాడిసన్ హోటల్‌లో ‘విజన్ విశాఖ’ పేరుతో నిర్వహించిన సదస్సులో కూడా ఇదే మాట చెప్పారు. తాను విశాఖపట్నం వస్తానంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, మీడియా వ్యతిరేక కథనాలు ప్రచురిస్తున్నదని, ఈసారి ఏదేమైనా సరే ఎన్నికలు ముగిసిన తరువాత ఇక్కడే నివాసం ఉంటానని, విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేశానని స్పష్టంచేశారు. విశాఖలో అన్ని వసతులు ఉన్నాయని ఒక వైపు ఒప్పుకుంటూనే ఈ ప్రాంతం వెనుకబడింది...అందుకే ఇక్కడి నుంచి పరిపాలన చేయాలనుకుంటున్నా, ఉత్తరాంధ్రాను ఉద్ధరిస్తా అంటూ మోసపూరిత మాటలు చెబుతున్నారు.
వస్తా..వస్తా అని చెప్పడం ఎందుకు..రావొచ్చుగా..?
- విశాఖలో ఉంటానంటూ సీఎం పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సమయంలో వారితో మాట్లాడుతూ కూడా ‘నేను విశాఖకు మారుతున్నా. మీరు కూడా రండి. స్టూడియోలకు మంచి భూములు ఇస్తా’ అని చెప్పారు.
- గత ఏడాది మార్చిలో విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించారు. దానికి నెల రోజుల ముందు ఢిల్లీలో రోడ్ షో చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న సీఎం ఇతర రాష్ట్రాల పారిశ్రామివేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను త్వరలోనే విశాఖకు మారుతున్నానని, మీరు కూడా రండి...అంటూ పిలుపునిచ్చారు. మార్చి 4వ తేదీన జరిగిన సదస్సులో కూడా త్వరలో విశాఖకు మారుతున్నానంటూ ప్రకటించారు.
- 2022 దసరాకు సీఎం విశాఖఫట్నం వచ్చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ పలు సందర్భాల్లో ప్రకటించారు.
- గత ఏడాది జనవరిలో విశాఖలో ఐటీ కంపెనీలు అన్నీ కలిసి మారియట్ హోటల్‌లో సదస్సు నిర్వహించాయి. ఆ సమావేశానికి హాజరైన ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఐటీ గురించి మాట్లాడకుండా, సీఎం ప్రస్తావన తీసుకువచ్చి, ‘ఉగాదికి సీఎం విశాఖ వచ్చేస్తున్నారు. మీడియా వారు రాసుకోండి’ అంటూ ప్రకటించారు.
- ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి అనేక సందర్భాల్లో సీఎం జగన్ 2023లో దసరాకు వస్తారని కొన్నిసార్లు, దీపావళి వెళ్లాక వస్తారని ప్రకటించారు. 2024 సంక్రాంతికి వస్తారని ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదిగో వస్తారు...ఇదిగో వస్తారని అంటున్నారు.
విశాఖపట్నం రావడానికి ఈ ప్రచారం దేనికి?, వచ్చేయవచ్చుగా. ఎవరు అడ్డం పడ్డారు?, ఎందుకు రావడం లేదు? రాకుండా ఎందుకు ఈ ప్రచారాలు?
న్యాయ స్థానాల్లో కేసులు ఉన్నంత వరకూ రాజధాని మార్చడానికి వీల్లేదు. సీఎంగా ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చు. కానీ వందలాది మంది అధికారులు, సిబ్బందిని వెంటేసుకుని వచ్చి, ప్రత్యేక కార్యాలయాలు అంటేనే న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఆ విషయం చెప్పకుండా...అడ్డం పడుతున్నారనే ఆరోపణలు దేనికో మరి. ఇక త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే సీఎం తాజాగా విశాఖకు వచ్చేస్తాననే మరోమారు ప్రకటన చేసి ఉంటారనే అభిప్రాయం వినిపిస్తోంది.
విద్యార్థుల అగచాట్లు
సీఎం సమావేశం కోసం ఇటు ఇచ్ఛాపురం నుంచి అటు ఏలూరు వరకూ గల విద్యార్థులు నగరానికి తరలింపు
ఉదయం 9 గంటలకు కన్వెన్షన్ హాలులోకి పంపించిన అధికారులు
మధ్యాహ్నం 3.30 గంటల వరకు లోపలే...
ఆకలితో విలవిల్లాడిన విద్యార్థులు..
ఆలస్యంగా వచ్చారని అనుమతించకపోవడంతో బయటే ఉండిపోయిన పలువురు
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పోతినమల్లయ్యపాలెంలోని ‘వి’ కన్వెన్షన్ హాలులో ‘ది కాస్కేడింగ్ స్కిల్స్-భవిత’ పేరిట నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సభకు సీఎం హాజరవుతున్నారని ప్రభుత్వం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులను రప్పించింది. వివిధ కోర్సులు పూర్తిచేసిన, శిక్షణ పొందిన, ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు/ యువకులను కార్యక్రమానికి తప్పనిసరిగా పంపించాల్సిందిగా ఆయా కళాశాలలు, సంస్థలకు అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. విద్యార్థులను తీసుకువచ్చే బాధ్యతను కూడా ఆయా శిక్షణ సంస్థలు, కాలేజీలకే అప్పగించారు. ఇటు ఇచ్ఛాపురం నుంచి అటు ఏలూరు, రాజమండ్రి, కాకినాడ వంటి ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులను ఈ సమావేశానికి తీసుకువచ్చారు. సీఎం పన్నెండు గంటలకల్లా కన్వెన్షన్ సెంటర్‌కు వస్తారంటూ...అంతకు మూడు గంటలు ముందే అంటే ఉదయం తొమ్మిది గంటలకే విద్యార్థులను లోనికి పంపించారు. కానీ, ఆయన మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు సభలో పాల్గొన్నారు. కార్యక్రమం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 3.30 అయ్యింది. సుమారు ఆరున్నర గంటలపాటు కన్వెన్షన్ హాలులో ఉండాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామంది విద్యార్థులకు స్నాక్స్, మంచి నీరు కూడా అందకపోవడంతో ఆకలితో అలమటించారు. మధ్యాహ్నం 3.30 గంటల తరువాత బయటకు వచ్చిన విద్యార్థులకు ‘వి’ కన్వెన్షన్ ప్రాంగణంలో భోజనం ఏర్పాట్లు చేయలేదు. అక్కడే ఉన్న పలువురు అధికారులను భోజనం గురించి ఆరా తీయడంతో...వచ్చిన బస్సుల్లో ఏర్పాటు చేశామని సమాధానం ఇచ్చారు.
బయటే ఉండిపోయిన విద్యార్థులు
ఈ సభలో పాల్గొనేందుకు కాకినాడ, ఏలూరు నుంచి వచ్చిన పలువురు విద్యార్థులు కన్వెన్షన్ హాలు బయటే ఉండిపోయారు. సమయానికి రాకపోవడంతో పోలీసులు వారిని అనుమతించలేదు. ఐడీ కార్డులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు కన్వెన్షన్ హాలు బయట ఉన్న చెట్ల కింద ఉండిపోయారు. కొందరు తాము వచ్చిన బస్సుల్లోకి వెళ్లి కూర్చున్నారు. అంత దూరం నుంచి కష్టపడి వస్తే కనీసం లోపలకు పంపించకపోవడం దారుణమని, ఆ మాత్రం దానికి తీసుకురావడం ఎందుకని పలువురు ప్రశ్నించారు.
డెలిగేట్లుగా సచివాలయ సిబ్బంది
ఏయూ ప్రొఫెసర్లంతా అక్కడే...
ముఖం చాటేసిన నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలు
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
‘విజన్ విశాఖ’ పేరుతో నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం సమావేశానికి సచివాలయ సిబ్బందిని కూడా డెలిగేట్లుగా పంపించారు. ఈ సమావేశానికి ఇతర రాషా్ట్రల నుంచి వచ్చే వారితో కలిపి రెండు వేల మంది హాజరవుతారని ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. విశాఖలో పారిశ్రామికవేత్తలందరినీ రావాలని పిలుపునిచ్చారు. ఏపీఐఐసీ అధికారులు, కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు నగర పారిశ్రామికవేత్తలకు ఫోన్లు చేసి మరీ ఆహ్వానించారు. ఒక్కొక్కరికి మూడుసార్లు ఫోన్లు చేశారు. కన్‌ఫర్మ్ చేయాలని పదేపదే కోరారు. చాలామంది తాము రావడం లేదని చెబితే, కారణం ఏమిటి?, అంటూ అధికారులు ఎదురు ప్రశ్నించారు. కొందరు ఆరోగ్యం బాగా లేదని, ఊళ్లో లేమని చెప్పారు. మరికొందరు...ఏ కారణమో ఎందుకు చెప్పాలి?...ఎదురు ప్రశ్నించారు. తాము ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని, అందుకే కారణాలు అడుగుతున్నామంటూ ఫోన్లు చేసిన వారు వాపోయారు. ఈ సమావేశానికి విశాఖలో సగం మంది పారిశ్రామికవేత్తలు హాజరుకాలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్లు అంతా సూట్లు వేసుకొని సమావేశానికి వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో పదుల సంఖ్యలో హాజరయ్యారు. రెండు వేల మందికి ఏర్పాట్లు చేయగా సగం సీట్లు ఖాళీగా ఉండిపోవడంతో సచివాలయాల సిబ్బందిని పంపించారు. వారికి పాస్‌లు అందించే బాధ్యతను మధురవాడ సచివాలయ సిబ్బందికి అప్పగించారు. దాంతో వారు హోటల్ బయట ప్రహరీ దగ్గరే ఉండి, వచ్చిన వారికి పాస్‌లు ఇచ్చి లోపలకు పంపించారు. అలాగే కేటరింగ్‌లు నడిపేవారిని, పర్యాటకులకు కార్లు అద్దెకు ఇచ్చేవారిని, రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లు విక్రయించే వారిని తీసుకువచ్చి సీట్లు నింపేశారు. ముందు వరుసల్లో మంత్రులు, అధికారులు కూర్చొని, ఆ తరువాత సూట్లు వేసుకున్న అధికారులు, పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి...ఆ తరువాత అంతా ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చిన వారిని కూర్చోబెట్టారు.
దుకాణాలు బంద్
మద్యం దుకాణాలకు మాత్రం మినహాయింపు
సీఎం జగన్ పర్యటనలో అధికారుల వింతవైఖరి
చిరు వ్యాపారులకు పారిశ్రామికవేత్తలుగా కలరింగ్
డెలిగేట్లుగా పాస్‌లు జారీచేసిన అధికారులు
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నగర పర్యటన సందర్భంగా అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. భద్రత పేరుతో ఆయన ప్రయాణించే మార్గంలో గల దుకాణాలన్నింటినీ మూసివేయించారు. నిత్యావసర దుకాణాలతోపాటు మందుల దుకాణాలకు కూడా తెరవనివ్వలేదు. కానీ ప్రభుత్వ మద్యం దుకాణాలను మాత్రం మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలను మూసివేయించేస్తే ఆ నాలుగైదు గంటల్లో విక్రయాలు నిలిచిపోయి, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందోనని భావించినట్టున్నారని పలువురు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక దుకాణాలను మూసివేయించిన అధికారులు, భవన నిర్మాణ సామగ్రి ఉన్నట్టయితే బయటకు కనిపించకుండా గ్రీన్‌మ్యాట్‌లతో కప్పివేయించారు.
ఇదిలావుండగా సీఎం జగన్ మంగళవారం రాడిసన్‌బ్లూ హోటల్‌లో ‘వైజాగ్ విజన్-ప్యూచర్ విశాఖ’ పేరుతో రెండు వేల మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారని అధికారులు ప్రకటించారు. అయితే పారిశ్రామికవేత్తల పేరుతో నగరంలోని ఒక స్వీట్ దుకాణం యజమానికి, మరో ఫంక్షన్‌హాల్ యజమానికి పాస్‌లు జారీచేసి సదస్సుకు అనుమతించడం కనిపించింది. వారిద్దరూ పాస్‌లు మెడలో వేసుకుని హోటల్‌లోకి వెళుతుండగా హోటల్ బయట ఉన్నవారు కొందరు గుర్తుపట్టి...వారు పారిశ్రామికవేత్తలా?...అంటూ ఆశ్చర్యపోయారు. సదస్సుకు రెండు వేల మంది పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారని అధికారులు ప్రకటించగా, వారిలో సగం మంది వీరే ఉన్నట్టున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. దీనికి బలం చేకూర్చేలా కొంతమంది మహిళలు డెలిగేట్ పాస్‌లు చేతిలో పట్టుకుని హోటల్ బయట వేచి ఉంటే...వారి దగ్గరకు రాజకీయ నాయకుల అనుచరులు వచ్చి పాస్ రాయించుకుని లోపలకు వెళ్లారు.