Share News

వాకర్స్‌తో సీఎం రమేశ్‌ ఆత్మీయ కలయిక

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:42 AM

స్థానిక బెల్లం మార్కెట్‌ యార్డులో అనకాపల్లి వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ శుక్రవారం ఆత్మీయంగా కలిశారు.

వాకర్స్‌తో సీఎం రమేశ్‌ ఆత్మీయ కలయిక
ఎన్‌టీఆర్‌ బెల్లం మార్కెట్‌ యార్డులో వాకర్స్‌తో నడుస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

కొత్తూరు, ఏప్రిల్‌ 19: స్థానిక బెల్లం మార్కెట్‌ యార్డులో అనకాపల్లి వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ శుక్రవారం ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా వాకర్స్‌తో కలిసి మార్కెట్‌ యార్డులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మార్కెట్‌ యార్డు అంతా నడుస్తూ వాకర్స్‌తో ముచ్చటించారు. రమేశ్‌ విజయానికి తామంతా కృషి చేస్తామని వాకర్స్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్‌ మాట్లాడుతూ.. అనకాపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేద్దామన్నారు. ఇక్కడున్న పాలకులు దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో వాకర్స్‌ ట్రాక్‌ లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. అనంతరం అసోసియేషన్‌ సభ్యులు డీడీ.నాయుడు మాట్లాడుతూ పట్టణానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావాలని కోరగా సీఎం రమేశ్‌ స్పందిస్తూ కేంద్రం మంజూరు చేసిన కేవీని రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి కొందరు నాయకులు పూర్తిగా అటకెక్కించారన్నారు. జిల్లాలో మూడు కేంద్రీయ విద్యాలయాలు తీసుకువచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:42 AM