ఏరియా ఆస్పత్రి ప్రక్షాళన
ABN , Publish Date - Aug 29 , 2024 | 11:18 PM
స్థానిక ఏరియా ఆస్పత్రి ప్రక్షాళనకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న ఎనస్థీషియా వైద్యుడిని అధికారులు సరెండర్ చేశారు. ఆస్పత్రి ఉద్యోగులు అరగంట ఆలస్యంగా విధులకు హాజరైతే ఆబ్సెంట్ వేస్తున్నారు.
చర్యలు తీసుకుంటున్న అధికారులు
అరగంట ఆలస్యమైతే ఆబ్సెంట్
విధులకు గైర్హాజరైన ఎనస్థీషియా సరెండర్
వారానికి రెండు రోజులు విధులకు హాజరయ్యే వైద్యులు రాజీనామా
ప్రత్యేక వైద్య నిపుణుల భర్తీకి చర్యలు
చింతపల్లి, ఆగస్టు 29: స్థానిక ఏరియా ఆస్పత్రి ప్రక్షాళనకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న ఎనస్థీషియా వైద్యుడిని అధికారులు సరెండర్ చేశారు. ఆస్పత్రి ఉద్యోగులు అరగంట ఆలస్యంగా విధులకు హాజరైతే ఆబ్సెంట్ వేస్తున్నారు.
స్థానిక 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం అప్‌గ్రేడ్ చేసింది. వంద పడకల ఆస్పత్రికి అవసరమైన వైద్యులు, దిగువస్థాయి ఉద్యోగుల పోస్టులను మంజూరు చేసింది. అయితే పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేయలేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది వైద్యులు ఇష్టారాజ్యంగా విధులకు హాజరయ్యేవారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆదివాసీ రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీంతో సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శిరి పర్యవేక్షణలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులను పటిష్టం చేశారు. వైద్యులు, ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ముగ్గురు వైద్యులకు ఉద్వాసన..
ఏరియా ఆస్పత్రిలో పేరుకు మాత్రమే వైద్యులుగా పనిచేసే ముగ్గురు వైద్యులకు సెకండరీ హెల్త్ అధికారులు ఉద్వాసన పలికారు. సుమారు ఆరు నెలలుగా విధులకు గైర్హాజరైన సీనియర్ ఎనస్థీషియా వైద్యుడుని సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ సరెండర్ చేశారు. అలాగే రెండో ఎనస్థీషియా, జనరల్ సర్జన్ వైద్యులు వారానికి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతామని, మిగిలిన రోజులు సెలవు కావాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణారావు, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని కోరారు. కచ్చితంగా ప్రతి రోజు విధులకు హాజరుకావాలని సూపరింటెండెంట్ ఆదేశించడంతో రెండో ఎనస్థీషియా, జనరల్ సర్జన్ వైద్యులు ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు.
కచ్చితంగా సమయపాలన పాటించాల్సిందే..
నూతనంగా సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ గంటా ప్రభావతి వైద్యులతోపాటు ఉద్యోగులు కచ్చితంగా సమయపాలన పాటించేలా చర్యలు తీసుకున్నారు. సెకండరీ హెల్త్ అధికారుల ఆదేశాల మేరకు వైద్యులు, ఇతర ఉద్యోగులు విధులకు అరగంట ఆలస్యమైతే సూపరింటెండెంట్ ఆబ్సెంట్ నమోదు చేస్తున్నారు. తాజాగా విధులకు ఆలస్యంగా వచ్చిన సీనియర్ వైద్యురాలికి సైతం అబ్సెంట్ నమోదు చేశారు. దీంతో ఏరియా ఆస్పత్రి వైద్యులు, దిగువ స్థాయి ఉద్యోగులు గాడిలో పడ్డారు. ఏరియా ఆస్పత్రిలో ఖాళీగానున్న ఎనస్థీషియా, జనరల్ సర్జన్, ఇతర ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు భర్తీ చేసేందుకు సెకండరీ హెల్త్ అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రత్యేక రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.