క్లీన్ వైజాగ్
ABN , Publish Date - Jan 12 , 2024 | 01:19 AM
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో విశాఖపట్నం మరోసారి సత్తాచాటింది. జాతీయ స్థాయిలో నాలుగో పరిశుభ్ర నగరం (లక్ష జనాభాకు పైబడిన నగారాల కేటగిరీ)గా నిలిచింది.

సంవత్సరం ర్యాంకు
2015 237
2016 5
2017 3
2018 7
2019 23
2020 9
2021 9
2022 4
2023 4
----------------------------------
జీవీఎంసీ సాధించిన మార్కులు
కేటగిరి మొత్తంమార్కులు సాధించిన మార్కులు
స్టేట్ లెవెల్ ప్రోగ్రెస్ 4,830 4,529.13
సర్టిఫికేషన్ 2,500 2,300
సిటిజన్ వాయిస్ 2,170 2,050.12
మొత్తం 9,500 8,879.30
----------------------------------------
దేశంలో నాలుగో పరిశుభ్ర నగరంగా గుర్తింపు
స్వచ్ఛ సర్వేక్షణ్-23 ఫలితాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
లక్షపైన జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జాతీయస్థాయిలో నాలుగో ర్యాంక్
9,500 మార్కులకు 8879.30 మార్కులు
ఢిల్లీలో అవార్డులు అందుకున్న రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి, జీవీఎంసీ మేయర్
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో విశాఖపట్నం మరోసారి సత్తాచాటింది. జాతీయ స్థాయిలో నాలుగో పరిశుభ్ర నగరం (లక్ష జనాభాకు పైబడిన నగారాల కేటగిరీ)గా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హరదీప్‌సింగ్‌పురి స్వచ్ఛ సర్వేక్షణ్-2023 పోటీ ఫలితాలను ప్రకటించడంతోపాటు ర్యాంకులు సాధించిన నగరాలకు అవార్డులను అందజేశారు.
జాతీయ స్థాయిలో లక్షలోపు, పైబడి జనాభా ఉన్న నగరాలుగా విభజించి స్వచ్ఛ సర్వేక్షణ్-2023 పోటీ నిర్వహించారు. లక్ష జనాభా పైబడిన నగరాల కేటగిరీలో 4,477 నగరాలు పోటీపడ్డాయి. ఆయా నగరాల్లో కేంద్ర బృందాలు గత నెలలో వారం రోజుల పాటు పర్యటించాయి. పరిశుభ్రత, వీధులు, డోర్‌టుడోర్ చెత్త సేకరణ, విభజన, యార్డులకు తరలింపు, శాస్త్రీయ పద్ధతిలో పునర్వినియోగం, వీధులు, ఖాళీస్థలాల్లో చెత్త పోగుపడకుండా నివారించడం, వాణిజ్య ప్రాంతాలు, మార్కెట్లలో పరిశుభ్రత, నీటి వనరుల పరిశుభ్రత, ప్రజా మరుగుదొడ్లలో పరిశుభ్రత వంటివి పరిశీలించాయి. ఆయా నగరాలు రాష్ట్ర స్థాయిలో ప్రజలకు సేవలందించడంలో సాధించిన పురోగతి, తాగునీటి స్వచ్ఛత, మురుగునీటి పునర్వినియోగం, కాలుష్య నియంత్రణ, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్టిఫికెట్లు, స్థానిక సంస్థల పనితీరు, స్థానిక సంస్థల పనితీరుపై ప్రజల అభిప్రాయం పేరుతో మూడు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర బృందాలు సర్వే చేపట్టాయి. జీవీఎంసీకి స్టేట్ లెవెల్ ప్రోగ్రెస్ (రాష్ట్రస్థాయిలో ప్రజాపాలనలో సాధించిన పురోగతి) అంశంలో 4,830 మార్కులకు గానూ 4529.13 మార్కులు, సర్టిఫికేషన్ (పలు అంశాల్లో చూపిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సర్టిఫికెట్లు) అంశంలో 2,500 మార్కులకు గానూ 2,300 మార్కులు, సిటిజన్ వాయిస్ (జీవీఎంసీ పనితీరు, అందిస్తున్న సేవలు) అంశంలో 2,170 మార్కులకుగాను 2,050.12 మార్కులు మొత్తం 9,500కి 8879.30 మార్కులు రావడంతో విశాఖపట్నం దేశంలోనే నాలుగో పరిశుభ్ర నగరంగా నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు 9,348.39 మార్కులు సాధించి ఉమ్మడిగా తొలిస్థానంలో నిలిస్తే, నవీ ముంబై 9,240.30 మార్కులతో మూడో స్థానంలో ఉంది. 8855.2 మార్కులతో భోపాల్ ఆరో స్థానం, 8,751.3 మార్కులతో విజయవాడ ఆరు, 8,728.3 మార్కులతో న్యూఢిల్లీ ఏడు, 8,624.50 మార్కులతో తిరుపతి ఎనిమిది, 8,601.30 మార్కులతో హైదరాబాద్ తొమ్మిది, 8,595.2 మార్కులతో పూణే పదో స్థానంలో నిలిచాయి.
237 నుంచి నాలుగో ర్యాంక్‌కు....
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛసర్వేక్షణ్ పోటీకి శ్రీకారం చుట్టినప్పటి నుంచి విశాఖ నగరం క్రమంగా ర్యాంకులను మెరుగుపరుచుకుంటూ వస్తోంది. పోటీ ప్రారంభించిన తొలిఏడాది 2015లో 237, 2016లో ఐదు, 2017లో మూడు, 2018లో ఏడు, 2019లో 23, 2020, 2021లో తొమ్మిది, 2022తోపాటు 2023 పోటీల్లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది.
వచ్చే ఏడాది టాప్-3లో నిలవడమేలక్ష్యం
సీఎం సాయికాంత్‌వర్మ, జీవీఎంసీ కమిషనర్
వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో తొలి మూడు ర్యాంకుల్లో నిలవడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాం. ఈ ఏడాది పోటీలో ఎక్కడ వెనుకబడ్డామో గుర్తించి వాటిని అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఈ ఏడాది బయో రెమిడియేషన్‌లో కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి. ఇప్పటికే కాపులుప్పాడ డంపింగ్‌యార్డులో నాలుగు లక్షల టన్నుల వ్యర్థాలను పునర్వినియోగం చేశాం. మిగిలిన ఐదు లక్షల టన్నులను కూడా వచ్చే ఏడాదిలోపు పునర్వినియోగం చేసి యార్డును పార్కుగా మార్చుతాం. మిగిలిన అంశాల్లో ఈ ఏడాది మాదిరిగానే స్థిరమైన ప్రణాళికలు అమలుచేస్తే టాప్-3లో నిలవడం ఖాయం. నగర ప్రజలతోపాటు జీవీఎంసీ అధికారులు, స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్లు, ఎన్‌జీవోల సహకారంతోనే గత రెండేళ్లుగా నాలుగో ర్యాంకు సాధించగలిగాం.