గాజువాక వైసీపీలో కుమ్ములాట
ABN , Publish Date - Mar 05 , 2024 | 01:33 AM
గాజువాక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
నాగిరెడ్డి వర్సెస్ చందు
రెండు వర్గాలుగా చీలిపోయిన నేతలు
చందూకు కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే
మేయర్ గొలగాని హరివెంకటకుమారి పేరు సిఫారసు
సమన్వయకర్తకు కొందరు కార్పొరేటర్లు మద్దతు
వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహణ
ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వద్దకు చేరిన పంచాయితీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గాజువాక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తను మార్చినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా వున్న వైషమ్యాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతుంటే నేతల మధ్య ఈ కుమ్ములాటలు ఏమిటంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.
2019 ఎన్నికల తర్వాత గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు దేవన్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. రెండు నెలల కిందట దేవన్‌రెడ్డిని సమన్వయకర్తగా తొలగించిన అధిష్ఠానం...ఆ స్థానంలో 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావు(చందు)ను నియమించింది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రరావే గాజువాక నుంచి పోటీకి దిగుతారని పార్టీలో ప్రచారం జరిగింది. దీనిపై ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితోపాటు ఆయన కుమారుడు దేవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. విషయం అధిష్ఠానం దృష్టికి చేరడంతో నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులను తాడేపల్లి పిలిచి బుజ్జగించింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా టికెట్ తమకే ఇవ్వాలని...ఒకవేళ వీలుకాని పక్షంలో ఉరుకూటి చందుకు తప్ప వేరెవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని నాగిరెడ్డి స్పష్టంచేశారు. ఈ పరిణామంతో ఉరుకూటి చందును మార్చేస్తారని, ఆయన స్థానంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ లేదంటే మేయర్ గొలగాని హరివెంకటకుమారిని నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత గాజువాకలో జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి హాజరై అభ్యర్థి చందూయేనని ప్రకటించారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే ఎమ్మెల్యే నాగిరెడ్డి వేరొకచోట తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసి సమన్వయకర్తగా నియమించినంత మాత్రానా ఎన్నికల్లో అభ్యర్థి అయిపోరని, ఎన్నికల్లోపు ఎటువంటి మార్పులైనా జరగవచ్చునని పునరుద్ఘాటించారు. చందూ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ యాదవ సామాజిక వర్గానికి మాత్రమే గాజువాక టికెట్ ఇవ్వదలిస్తే జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి పేరు పరిశీలించాలంటూ సూచించారు. ఈ క్రమంలోనే గత పది రోజులుగా మేయర్ గొలగాని హరివెంకటకుమారితో గాజువాక నియోజకవర్గంలో కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. అదే సమయంలో సమన్వయకర్త హోదాలో చందూ నిర్వహించే కార్యక్రమాలకు ఎమ్మెల్యే నాగిరెడ్డి గైర్హాజరవుతున్నారు. ఆదివారం నియోజకవర్గంలో ఉరుకూటి చందు నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే నాగిరెడ్డి హాజరుకాలేదు. అదే సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు బీఎన్ పాత్రుడు, మహ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నాగిరెడ్డికి వ్యతిరేకంగా సమావేశంలో కొందరు మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారని స్పష్టమైంది. ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో పార్టీ గెలుపు కష్టమేనని కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే నాగిరెడ్డి తీరుపై సమన్వయకర్త చందుతోపాటు కొంతమంది కార్పొరేటర్లు సోమవారం ఎండాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై ఆయన స్పందిస్తూ మంగళవారం నగరానికి సీఎం జగన్ వస్తున్నందున గాజువాక సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది.