Share News

పౌర సరఫరాల్లో తేలని పంచాయితీ

ABN , Publish Date - May 29 , 2024 | 01:05 AM

జిల్లా పౌర సరఫరాల సంస్థ పరిధిలో రెండు సర్కిళ్ల మధ్య దుకాణాల కేటాయింపుపై తలెత్తిన సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.

పౌర సరఫరాల్లో తేలని పంచాయితీ

84 దుకాణాలకు ఇప్పటివరకూ అందని సరకులు

ఆందోళనలో డీలర్లు

పట్టించుకోని అధికారులు

విశాఖపట్నం/మర్రిపాలెం, మే 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పౌర సరఫరాల సంస్థ పరిధిలో రెండు సర్కిళ్ల మధ్య దుకాణాల కేటాయింపుపై తలెత్తిన సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రేషన్‌ డీలర్లు గత నెల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో జూన్‌ నెలకు సంబంధించి కొన్ని డిపోలకు ఇంతవరకూ సరకులు అందలేదు.

నగరంలోని సర్కిల్‌-2లో గల 69 దుకాణాలను సర్కిల్‌-1లోకి, 25 దుకాణాలను భీమిలి పరిధిలోకి మార్చారు. దీనిపై సర్కిల్‌-2 (మర్రిపాలెం)లో సరకులు లోడింగ్‌ చేసే కలాసీలు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతానికి భీమిలి పరిధిలోకి వెళ్లిన 25 షాపులకు అవసరమైన సరకుల లోడింగ్‌ బాధ్యత మర్రిపాలెంలోని సర్కిల్‌-2 గోదాము కలాసీలే చూసుకోవాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం జిల్లా పౌర సరఫరాల అధికారులు చర్యలు తీసుకోవాలని వారం క్రితం జేసీ ఆదేశించినా క్షేత్ర స్థాయిలో అమలు కాలేదు. మర్రిపాలెం నుంచి కలాసీలు భీమిలి గోదాము వద్దకు వెళ్లి సరకులు లోడింగ్‌ చేయడానికి అక్కడి కలాసీలు అంగీకరించడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని డీలర్లు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. కాగా జూన్‌ నెలకు సంబంధించి వాటిల్లో 84 షాపులకు తప్ప జిల్లాలో మిగిలిన షాపులకు దాదాపు సరకులు సరఫరా అయ్యాయి. గత నెలలో సర్కిల్‌-2 నుంచి సర్కిల్‌-1కు బదలాయించిన 60, భీమిలికి కేటాయించిన 25 దుకాణాలకు మంగళవారం వరకూ సరకులు సరఫరా జరగలేదు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు సరకులు వీధుల్లో ఎండీయూలు ద్వారా అందించాల్సి ఉంది. సాధారణంగా ప్రతి నెలా 21 నుంచి 28వ తేదీలోపు డిపోలకు బియ్యం, ఇతర సరకులు సరఫరా ప్రక్రియ పూర్తవుతుంది. అటువంటిది 84 దుకాణాలకు ఇంతవరకూ సరకులు రాకపోవడంతో డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో పౌర సరఫరాల అధికారులు చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డుదారులకు సమాధానం చెప్పలేమని డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

సంబల్‌పూర్‌-కాచీగూడ ప్రత్యేక రైలు రద్దు

విశాఖపట్నం, మే 28:

వేసవి ప్రయాణికుల సౌకర్యర్థం సంబల్‌పూర్‌-కాచీగూడ మధ్య ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లను రద్దు చేశామని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న నేపథ్యంలో జూన్‌ 17, 24న సంబల్‌పూర్‌ నుంచి కాచీగూడ వెళ్లే 08325 నంబరు గల రైళ్లను, అలాగే తిరుగు ప్రయాణంలో జూన్‌ 18, 25న కాచీగూడ నుంచి సంబల్‌పూర్‌ రావాల్సిన 08326 నంబరు గల రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

31న బెంగళూరు-అగర్తాలా రైలు రద్దు

న్యూ హాప్లాంగ్‌, జటింగా లంపూర్‌ స్టేషన్ల మధ్య ట్రాక్‌ సస్పెన్షన్‌ దృష్ట్యా ఈనెల 31న ఎస్‌ఎంవీ బెంగళూరు నుంచి అగర్తాలా వెళ్లాల్సిన హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను (12503) రద్దు చేసినట్టు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. కాగా ఈనెల 28న (మంగళవారం) అగర్తాలాలో బయలుదేరి ఎస్‌ఎంవీ బెంగళూరు వెళ్లాల్సిన హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను (12504) బదర్‌పూర్‌ స్టేషన్‌ వరకూ నడుపుతున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - May 29 , 2024 | 01:05 AM