Share News

సిగరెట్ల మాఫియా

ABN , Publish Date - Mar 26 , 2024 | 01:14 AM

నిషేధిత ఈ-సిగరెట్లతోపాటు ప్రముఖ బ్రాండ్‌ల పేరుతో తయారుచేసిన నకిలీ సిగరెట్లు నగరాన్ని ముంచెత్తుతున్నాయి.

సిగరెట్ల మాఫియా

ఒకవైపు నకిలీ సిగరెట్లు..మరోవైపు ఈ-సిగరెట్లు

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొంతమంది వ్యాపారులు

ప్రతినెలా రూ.80 కోట్ల నకిలీ సిగరెట్ల వ్యాపారం

ప్రజల ఆరోగ్యానికి ముప్పు

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఖజానాకు గండి

దృష్టిసారించని సెంట్రల్‌ ఎక్సైజ్‌, రాష్ట్ర పన్నుల శాఖ, పోలీస్‌ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నిషేధిత ఈ-సిగరెట్లతోపాటు ప్రముఖ బ్రాండ్‌ల పేరుతో తయారుచేసిన నకిలీ సిగరెట్లు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో తయారైన నాసిరకం సిగరెట్లతో పాటు ఈ-సిగరెట్లను కొంతమంది గుట్టుగా నగరానికి దిగుమతి చేసుకుని కిరాణా వ్యాపారులు, పాన్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ సిగరెట్ల కారణంగా రూ.కోట్లలో ప్రభుత్వం ఆదాయం కోల్పోతోంది.

నగరంలో గుట్కా మాఫియా తరహాలోనే నకిలీ సిగరెట్ల మాఫియా విస్తరిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు కూడా వీటి విక్రయాలకే మొగ్గుచూపుతున్నారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్‌గా మారి పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌తోపాటు మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుంచి రహస్యంగా పారిస్‌, ఓల్డ్‌ స్పైస్‌, గుడ్‌టైమ్స్‌, మోర్‌ ఇంటర్నేషనల్‌ వంటి బ్రాండ్ల సిగరెట్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇవి నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, నాసిరకం పొగాకుతో తయారైనవి. ఈ నకిలీ సిగరెట్లు నగర మార్కెట్‌లో ప్రతి నెలా రూ.80 కోట్ల వరకూ అమ్ముడవుతున్నట్టు సిగరెట్‌ వ్యాపారంలో ఉంటున్నవారు చెబుతున్నారు. ఐటీసీ సిగరెట్లను సరఫరా చేసే డిస్ర్టిబ్యూటర్లు నగరంలో నలుగురు మాత్రమే ఉన్నారు. వీరంతా కలిసి నెలకు రూ.50 కోట్ల విలువైన సిగరెట్లను చిరు వ్యాపారులకు సరఫరా చేస్తుంటారు. అయితే నకిలీ సిగరెట్‌ ధర బాగా తక్కువ కావడంతో ఎక్కుమంది ధూమపాన ప్రియులు వాటివైపే మొగ్గుచూపుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల సిగరెట్‌ల మాదిరిగానే కనిపించే నకిలీ సిగరెట్లు తక్కువ ధరకే వస్తుండడంతో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వాటివైపే మొగ్గుచూపుతున్నారు. ఐటీసీ బ్రాండ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ నకిలీ సిగరెట్లు అమ్ముడవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

చాపకింద నీరులా ఈ-సిగరెట్‌ల విక్రయాలు

మానవాళికి ప్రాణంతకమనే కారణంతో ఎలక్ర్టానిక్‌ సిగరెట్‌లను కేంద్రం పూర్తిగా నిషేధించింది. వీటిని విక్రయించడం, వినియోగించడం కూడా నేరంగానే పరిగణిస్తున్నారు. ఈ-సిగరెట్‌లను వినియోగించడం వల్ల పెద్దమొత్తంలో పొగ వెలువడుతుంది. అందులో నికోటిన్‌, టొబాకో రసాయనాలు ఉంటాయి. దీనిని తాగేవారితోపాటు వారు విడిచే పొగను పీల్చే చుట్టుపక్కల వారి ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అయితే నగరంలో చాలామంది యువత ఈ-సిగరెట్ల వినియోగాన్ని ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ పెరుతోంది. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది వ్యాపారులు నిషేధాన్ని పక్కనపెట్టి మరీ ముంబై నుంచి రహస్యంగా ఈ-సిగరెట్‌లను నగరానికి దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని భారీ లాభాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో ఈ-సిగరెట్ల వ్యాపారం నెలకు రూ.రెండు కోట్లు వరకూ జరుగుతుందని అంచనా. తాజాగా సిరిపురం కూడలిలోని మీరా కలెక్షన్స్‌తోపాటు దేజావు క్లాత్‌ షాప్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి రూ.25 లక్షల విలువ చేసే ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదుచేశారు. ఇప్పటికైనా పోలీసులు, కేంద్ర కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ, రాష్ట్ర పన్నులశాఖ అధికారులు దృష్టిసారిస్తే నకిలీ సిగరెట్‌లతోపాటు ఈ-సిగరెట్‌ మాఫియాకు అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 26 , 2024 | 01:14 AM