Share News

ఇండిపెండెంట్‌ను నిర్బంధించిన సీఐ

ABN , Publish Date - Apr 30 , 2024 | 02:02 AM

విశాఖ నగర పరిధిలోని మల్కాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.సన్యాసినాయుడును పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సోమవారం సస్పెండ్‌ చేశారు.

ఇండిపెండెంట్‌ను నిర్బంధించిన సీఐ

నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి

రిటర్నింగ్‌ అధికారికి బాధితుడి ఫిర్యాదు

విచారణ అనంతరం సీఐపై సీపీ సస్పెన్షన్‌ వేటు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):

విశాఖ నగర పరిధిలోని మల్కాపురం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.సన్యాసినాయుడును పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సోమవారం సస్పెండ్‌ చేశారు. పశ్చిమ నియోజక వర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా కొయిలాడ వెంకట జగదీశ్వరరావు అనే రౌడీషీటర్‌ నామినేషన్‌ వేశారు. ప్రతి ఆదివారం పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంటారు. ఈనెల 28న మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు జగదీశ్వరరావు హాజరయ్యాడు. కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన రౌడీషీటర్లు అందరినీ ఇంటికి పంపించేసిన సీఐ సన్యాసినాయుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన జగదీశ్వరరావును మాత్రం స్టేషన్‌లోని మొదటి అంతస్థుకు తీసుకువెళ్లి రెండున్నర గంటలపాటు నిర్బంధించారు. నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ అసభ్య పదజాలంతో దూషించి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో జగదీశ్‌ స్టేషన్‌ మొదటి అంతస్థు నుంచి కిందికి దూకి పారిపోయేందుకు యత్నించగా సిబ్బంది పట్టుకున్నారు. ఇంటికి తీసుకువెళ్లి కుటుంబసభ్యులకు అప్పగించారు. జగదీశ్వరరావు శరీరంపై గాయాలు ఉండడంతో కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తీసుకువెళ్లి ఎంఎల్‌సీ కేటగిరీలో చేర్పించి చికిత్స చేయించారు. సీఐ తన పట్ల వ్యవహరించిన తీరుపై ఆధారాలతో బాధితుడు జగదీశ్వరరావు పశ్చిమ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి హుస్సేన్‌ సాహెబ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వెస్ట్‌ సబ్‌డివిజన్‌ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తిని ఆదేశించారు. విషయం సీపీ రవిశంకర్‌అయ్యన్నార్‌ దృష్టికి చేరడంతో సీఐ సన్యాసినాయుడును ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెన్షన్‌ సమయంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నగరాన్ని విడిచి బయటకు వెళ్లడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 02:02 AM