Share News

పిల్లలు కరెన్సీ నోట్లు చింపేశారని..

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:31 AM

పిల్లలు కరెన్సీ నోట్లు చింపేశారని క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పిల్లలు కరెన్సీ నోట్లు చింపేశారని..
చందన్‌కుమార్‌ మృతదేహం

క్షణికావేశంలో వ్యక్తి ఆత్మహత్య

గోపాలపట్నం, జూలై 18: పిల్లలు కరెన్సీ నోట్లు చింపేశారని క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిహార్‌ రాష్ట్రానికి చెందిన చందన్‌కుమార్‌ (33) రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య లాల్‌ మున్నీకుమారి, ఇద్దరు పిల్లలతో కొత్తపాలెం గణపతినగర్‌లో ఐదేళ్లగా నివసిస్తున్నారు. కాగా చందన్‌ కుమార్‌కు కోపం ఎక్కువ కావడంతో చిన్న విషయాలకే కోపోద్రేకానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి చందన్‌కుమార్‌ పిల్లలు ఆయన జేబులోని కొన్ని కరెన్సీ నోట్లను తీసి చింపేశారు. దీంతో ఆయన తీవ్రమైన కోపంతో తన గదిలోకి వెళ్లి క్షణికావేశంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతసేపటికీ భర్త గది తలుపులు తీయకపోవడంతో అనుమానంతో మున్నీకుమారి చుట్టుపక్కల వారి సాయంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా చందన్‌కుమార్‌ ఉరి వేసుకుని ఉండడంతో గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి, ఆత్మహత్యకు గల కారణాలను మున్నీకుమారిని అడిగి తెలుసుకున్నారు. చందన్‌కుమార్‌కు కోపం అధికమని, పిల్లలు అల్లరి చేసినా భరించేవాడు కాదని తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి సీఐ సురేశ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 12:31 AM