Share News

ఉత్సాహంగా మిలాన్‌-2024

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:04 AM

తూర్పు నౌకాదళంలో మిలాన్‌-2024 ఉత్సాహ పూరిత వాతావరణంలో సోమవారం ప్రారంభమైంది.

ఉత్సాహంగా మిలాన్‌-2024

తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ప్రారంభం

నేడు ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్‌

తూర్పు నౌకాదళంలో మిలాన్‌-2024 ఉత్సాహ పూరిత వాతావరణంలో సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు రెండో దశల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించనుండగా 50 దేశాలకు చెందిన నేవీ అధికారులు, సిబ్బంది, వారి యుద్ధనౌకలు, విమానాలు పాల్గొంటున్నాయి. తొలిరోజు సోమవారం మేరీటైమ్‌ వెల్ఫేర్‌ సెంటర్‌లో నేవీ అధికారులు అంతా కలిసి సముద్ర విన్యాసాలపై చర్చించారు. హాజరైన దేశాల ప్రతినిధులు ఒకరినొకరు పరిచయం చేసుకొని, ఆయా దేశాల ప్రాధాన్యతలు వివరించారు. హార్బర్‌ ఫేజ్‌లో భాగంగా రెండో రోజు మంగళవారం డాల్ఫిన్‌ కొండ నుంచి యారాడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహిస్తారు. అలాగే హిందూస్థాన్‌ షిప్‌యార్డులో సబ్‌మెరైన్లను ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన ఉంటుంది. సముద్ర విన్యాసాలపై మరోసారి చర్చిస్తారు.

మిలాన్‌-2024 ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు సంబంధించిన ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్‌ మంగళవారం ఆర్కే బీచ్‌రోడ్డులో జరగనుంది. దీని కోసం భారత నౌకాదళం, వివిధ దేశాల నుంచి వచ్చిన వారు గత మూడు రోజులుగా బీచ్‌లో రిహార్సళ్లు నిర్వహిస్తున్నారు. అవి సోమవారం కూడా జరిగాయి. ఇండియన్‌ కోస్టుగార్డు, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నేవల్‌ కేడెట్లతో పాటు అన్ని దేశాల నేవీల ప్రతినిధులు పాల్గొని మార్చ్‌ ఫాస్ట్‌ చేశారు.

Updated Date - Feb 20 , 2024 | 02:04 AM