మాస్టర్ ప్లాన్ మార్పు
ABN , Publish Date - Jul 14 , 2024 | 01:20 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించి, అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్-2041పై కొత్త ప్రభుత్వం దృష్టిసారించింది.
వీఎంఆర్‌డీఏ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
నాలుగేళ్ల క్రితం ఇష్టానుసారంగా ప్లాన్ రూపొందించిన నాటి అధికారులు
వైసీపీ నేతలకు అనుగుణంగా నిర్ణయాలు
ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చినా పరిగణనలోకి తీసుకోకపోవడంపై అప్పట్లోనే విమర్శలు
రెండు రోజుల క్రితం నగరానికి వచ్చినప్పుడు సీఎం సమీక్ష
లోపాలు గుర్తించి సవరించాలని సూచన
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించి, అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్-2041పై కొత్త ప్రభుత్వం దృష్టిసారించింది. వైసీపీ నేతలు వారికి అనుకూలంగా మార్చుకున్న మాస్టర్ ప్లాన్ రహదారులను గుర్తించి, సరిచేయాలని నిర్ణయించింది. మొదట ప్రతిపాదించిన మార్గాలు, ఆ తరువాత ఒత్తిళ్లతో మార్చిన రహదారుల వివరాల జాబితా రూపొందించాలని సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చినప్పుడు విమానాశ్రయంలో వీఎంఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. త్వరలో జరిగే సమీక్షకు ఆ వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో గతంలో వీఎంఆర్‌డీఏ అధికారులు అడ్డదిడ్డంగా మారిన మాస్టర్ ప్లాన్‌లో లోపాలను గుర్తించే పనిలో పడ్డారు.
విజయనగరం నుంచి పాయకరావుపేట వరకు ప్రభుత్వ, ప్రైవేటు భూముల వినియోగం, వివిధ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రైలు, రోడ్ నెట్‌వర్క్, రహదారుల విస్తరణ, నీటి వనరుల పరిరక్షణ, సద్వినియోగం తదితర అంశాలను స్పష్టం చేస్తూ వీఎంఆర్‌డీఏ నాలుగేళ్ల క్రితం 2021-2041 పేరుతో మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇది ఇరవై ఏళ్లు అమలులో ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఆయా జిల్లాల్లో పరిశ్రమలు, గృహ నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. రహదారులు నిర్మిస్తారు. ఎవరి భూములకైనా మాస్టర్ ప్లాన్ ప్రకారమే అనుమతులు ఇవాల్సి ఉంటుంది. దానిని ఉల్లంఘించడానికి వీల్లేదు. ఇంత కీలకమైన మాస్టర్ ప్లాన్ కావడంతో అప్పుడు అధికారంలో వైసీపీ నాయకులు దానిని వారికి అనుకూలంగా మలచుకున్నారు. విశాఖపట్నం, భీమునిపట్నం, భోగాపురం, విజయనగరం, అనకాపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాలు కొనుగోలు చేసిన వైసీపీ నేతలు వాటికి భవిష్యత్తులో మేలు జరిగేలా మాస్టర్ ప్లాన్‌ను మార్చుకున్నారు. ఈ క్రమంలో పక్కవారి భూముల్లోకి రహదారులను మళ్లించి వారికి నష్టం కలిగించారు. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకూ ప్రతిపాదించిన బీచ్ కారిడార్‌ను భీమిలి పట్టణానికి ముందు నేరెళ్లవలస వద్ద అష్టవంకరలు తిప్పి దొరతోట మీదుగా మళ్లించి మూలకుద్దు వద్ద మళ్లీ బీచ్‌రోడ్డులో కలిపారు. ఈ మార్గంలో వైసీపీ నాయకుల భూములే అధికంగా ఉన్నాయి. వైసీపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే నాయకులు పెద్ద సంఖ్యలో ఉండడం, వారంతా ఆయా ప్రాంతాల్లో వందలాది ఎకరాలు కొనడంతో వారికి అనుకూలంగా మార్చేశారు. పేరుకు బీచ్ కారిడార్ అయినా...బీచ్‌తో నిమిత్తం లేకుండానే వారి భూముల పక్కనుంచి ఈ మార్గం రూపొందించారు. దీనిపై అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా అప్పటి వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు పట్టించుకోలేదు. వైసీపీ పెద్దలు చెప్పినట్టుగానే అన్ని పనులు చేశారు.
విశాఖపట్నం సిటీ విషయానికి వస్తే సిరిపురం జంక్షన్ నుంచి సంపత్ వినాయకుడి ఆలయం మీదుగా ఆశీల్‌మెట్ట జంక్షన్ వరకు, వాల్తేరు క్లబ్ నుంచి నేవీ హౌస్ మీదుగా పందిమెట్ట వెళ్లే రహదారులను అప్పటి వైసీపీ ఎంపీ చెప్పినట్టుగా మార్చేశారు. విశాఖ నగరంలో 200 అడుగుల వెడల్పున రహదారులు విస్తరించడం అసాధ్యం అయినప్పటికీ ఆ విధంగానే మాస్టర్ ప్లాన్ తయారుచేశారు. సర్క్యూట్ హౌస్ ముందు నుంచి నేవీ హౌస్ మీదుగా పంది మెట్ట వరకు ఉన్న రహదారి విషయంలో చాలా తప్పులు చేశారు. అక్కడ దసపల్లా భూములు ఉన్నాయి. అవి అధికార పార్టీ పెద్దల చేతికి వస్తాయని ముందుచూపుతో అక్కడ నిర్మించబోయే బహుళ అంతస్థుల భవనాలకు అనుకూలంగా ఉండేలా 100 అడుగుల రహదారిని ప్రతిపాదించారు. ప్రస్తుతం అక్కడ 40 అడుగుల రహదారి ఉంది. డ్రాఫ్ట్‌లో 80 అడుగులు చూపించి, మాస్టర్‌ప్లాన్‌లో 100 అడుగులుగా పేర్కొన్నారు. దీనికి అవసరమైన భూమిని కూడా ఓ రాజు గారి బంగ్లాకు నష్టం జరగకుండా రెండో వైపు సేకరించాలని నిర్ణయించారు. సిరిపురం జంక్షన్ సమీపాన నాటి వైసీపీ ఎంపీ నిర్మిస్తున్న భారీ అపార్టుమెంట్ కోసం ఆ మార్గాన్ని అక్కడ మాత్రమే 200 అడుగులు చూపించి, ఆ తరువాత 100 అడుగులకు కుదించేశారు. ఆ ప్రకారం ఆయన భవనం నిర్మించక ముందే రహదారి కోసం తన భూమి పోయిందని రూ.68 కోట్ల విలువైన టీడీఆర్ తీసుకున్నారు. సాగర్‌నగర్‌లో ఓ స్టార్ హోటల్ విషయంలోను ఈ విధంగానే మాస్టర్ ప్లాన్ రహదారిని అటు వైపు కాకుండా ఇటువైపు విస్తరించాలని నిర్ణయించారు. ఇలా ఎక్కడికక్కడ వారికి అనుకూలంగా మార్పులు చేసుకుంటూ పోయారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆ మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసి అమలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జరిగిన తప్పులను సరిదిద్ది, నష్టపోయిన వారికి మేలు చేయాలని యోచిస్తోంది.