Share News

సర్టిఫికెట్ల కోసం పాట్లు

ABN , Publish Date - Mar 19 , 2024 | 01:24 AM

సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రచారం కోసం అన్నింటిపై తన ఫొటోలు వేసుకోవడం వల్ల ఇప్పుడు విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు.

సర్టిఫికెట్ల కోసం పాట్లు

ధ్రువపత్రాలన్నింటిపైనా సీఎం చిత్రం

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఇప్పుడు జారీ నిలిపివేయాల్సిన పరిస్థితి

జూన్‌ రెండో వారంలో రావాలంటున్న సిబ్బంది

ఉన్నతాధికారులు స్పందించాలంటున్న ప్రజానీకం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రచారం కోసం అన్నింటిపై తన ఫొటోలు వేసుకోవడం వల్ల ఇప్పుడు విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో ఎక్కడ కూడా నాయకుల ఫొటోలు ఉండకూడదని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టంచేసింది. ఆఖరుకు తహసీల్దార్‌ కార్యాలయాల ద్వారా ఇచ్చే ధ్రువపత్రాలు, పాస్‌బుక్‌లపై కూడా ఫొటోలు ఉంటే వాటి జారీని నిలిపివేయాలని ఆదేశించింది. దాంతో విద్యార్థులకు ఇక్కట్లు మొదలయ్యాయి.

ఇది పిల్లలను విద్యాలయాల్లో చేర్పించే సీజన్‌. పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆదాయం సర్టిఫికెట్లు, ఆర్థికంగా వెనుకబడిన వారనే ధ్రువీకరణ పత్రాలు తీసుకోవలసి ఉంటుంది. వీటి కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, వాటిని సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాలకు పంపించి, పరిశీలించాక జారీచేస్తారు. వాటిని దరఖాస్తుతో పాటు జత చేస్తే...ఆయా విభాగాల కింద విద్యార్థులకు రిజర్వేషన్‌ కల్పించి, సీట్లు కేటాయిస్తారు. ఈ ప్రాసెస్‌ అంతా పూర్తి కావడానికి వారం నుంచి పది రోజులు పడుతుంది. సచివాలయంలో ముందు దరఖాస్తు చేయాలి. ఎప్పటిలాగే అంతా సచివాలయాలకు వెళుతుంటే...అక్కడి సిబ్బంది వాటిని తీసుకోవడం లేదు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, సర్టిఫికెట్లు జారీ కావని చెప్పి తిరస్కరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాకే జూన్‌ రెండో వారంలో రావాలని చెబుతున్నారు. దాంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. జూన్‌లో ఏకంగా విద్యాలయాల్లో తరగతులు మొదలవుతాయని, అప్పుడు ఇస్తామంటే ఎలాగని వాపోతున్నారు. ఎన్నికలకు, సర్టిఫికెట్లకు సంబంధం ఏమిటని తెలియనవారు ప్రశ్నిస్తే...వాటిపై సీఎం బొమ్మ ఉంటుందని, అందుకే ఎన్నికల సంఘం వద్దని చెప్పిందని సమాధానమిస్తున్నారు. దాంతో ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పిల్లలకు ఇచ్చే సర్టిఫికెట్లు, పది కాలాలు భద్రపరుచుకునే పత్రాలపై నాయకుల బొమ్మలు ఎలా వేస్తారని, దానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా లేదని, ఈ ప్రభుత్వం వచ్చాకే ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇప్పుడు తమకు నెలాఖరులోగా సర్టిఫికెట్లు కావాలని, ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించి వెళుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలిగా...?

ప్రభుత్వ నిర్ణయాల వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు నష్టపోకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం, ఇతర నాయకుల బొమ్మలు ఏమీ లేకుండా ధ్రువపత్రాలు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యను ఎన్నికల సంఘానికి నివేదించి, తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Updated Date - Mar 19 , 2024 | 01:24 AM