Share News

సీబీఎస్‌ఈ టెన్త్‌ విద్యార్థులకు ఇంకా అందని పాఠ్య పుస్తకాలు!

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:22 AM

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ అమలు వ్యవహారంలో తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరు గందరగోళంగానే ఉంది.

సీబీఎస్‌ఈ టెన్త్‌ విద్యార్థులకు ఇంకా అందని పాఠ్య పుస్తకాలు!

బోధన కోసం ఉపాధ్యాయులకు పీడీఎఫ్‌లు

విద్యార్థుల వద్ద పుస్తకాలు లేకుంటే ఎలా...

ట్యాబ్‌లలో కూడా ఓపెన్‌ కాని వైనం

మరోవైపు మూల్యాంకనం విధుల్లో టీచర్లు

విద్యార్థులతో విద్యా శాఖ ఆటలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి):

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సిలబస్‌ అమలు వ్యవహారంలో తొలి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరు గందరగోళంగానే ఉంది. ప్రస్తుతం పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన పాఠ్యపుస్తకాలు ఇంకా అందలేదు. ప్రస్తుతం బోధన కోసం టీచర్లకు పీడీఎఫ్‌ ఫార్మెట్‌లో పాఠ్యపుస్తకాలు ఇవ్వడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు.

రెండేళ్ల క్రితం అంటే 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలలు/కేజీబీవీలు/రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలు చేశారు. విశాఖ జిల్లాలో 19 ఉన్నత పాఠశాలలు/కేజీబీవీలు/రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌లో పాఠాలు బోధిస్తున్నారు. దీనికి అనుగుణంగా సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాఠశాల విద్యా శాఖ పాఠ్యపుస్తకాలు ముద్రించి విద్యార్థులకు అందజేసింది. విద్యార్థుల సౌలభ్యం కోసం తెలుగు, ఆంగ్ల భాషలో పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నారు. అంటే పుస్తకంలో ఎడమ వైపు తెలుగు, కుడివైపు ఆంగ్ల భాషలో సిలబస్‌ ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదివిన విద్యార్థులకు సీబీఎస్‌ఈ రూపొందించే ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్ల క్రితం ఎనిమిదో తరగతి చదివిన విద్యార్థులంతా మార్చిలో తొమ్మిదో తరగతి పరీక్షలు రాసి ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో పదో తరగతిలోకి ప్రవేశించారు. రాష్ట్రంలో జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకు విద్యా సంవత్సరంగా పరిగణిస్తుండగా, సీబీఎస్‌ సిలబస్‌లో మాత్రం విద్యా సంవత్సరం ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభమవుతుంది. దీనికి అనుగుణంగా జిలాల్లో 19 పాఠశాలల్లో తొమ్మిదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తరగతికి ప్రమోట్‌ అయ్యారు. వీరికి పదో తరగతి సీబీఎస్‌ఈ సిలబస్‌లోనే మాత్రమే బోధన చేయాలి. విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు ముద్రణ చేసి పాఠశాలలకు సరఫరా చేయాలి. కానీ పాఠ్యపుస్తకాలు రూపొందించారు కానీ ముద్రణ పూర్తికాలేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావడంతో విద్యాశాఖ హడావిడిగా పాఠ్యపుస్తకాల పీడీఎఫ్‌లను టీచర్లకు పంపింది. జూన్‌లో పాఠశాలలు తెరిచేంత వరకు విద్యార్థులకు బోధన కోసం పీడీఎఫ్‌లను ఉపయోగించుకోవాలని సూచించింది. పీడీఎఫ్‌ ఫార్మెట్‌లో సిలబస్‌ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లో ఓపెన్‌ కావడం లేదు. ఇదిలావుండగా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్లంతా ప్రస్తుతం మూల్యాంకనం విధుల్లో ఉన్నారు. దీంతో జిల్లాలోని 19 పాఠశాలల్లో జడ్పీ, మునిసిపల్‌, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బోధన ప్రశ్నార్థకంగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Apr 05 , 2024 | 01:22 AM