Share News

ధన ప్రవాహం

ABN , Publish Date - May 15 , 2024 | 01:08 AM

ఈసారి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటుకు నోటు ఇవ్వాల్సి వచ్చింది. ఓటుకు రూ.1000, అంతకు మించి ఇవ్వాలనే డిమాండ్‌ ఓటర్ల నుంచే వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా? అని స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ధన ప్రవాహం

- ఈసారి ఎన్నికల్లో గ్రామాల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ

- ఓటుకు రూ.1500 నుంచి రూ.5 వేలు వరకు ఇవ్వాల్సిన పరిస్థితి

- ఓటరు తీరు మారడంతో రాజకీయ నేతల్లో గుబులు

- సేవకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన

- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉంటే కష్టమేనని స్థానిక నేతల నిట్టూర్పు

చోడవరం, మే 14: ఈసారి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఓటుకు నోటు ఇవ్వాల్సి వచ్చింది. ఓటుకు రూ.1000, అంతకు మించి ఇవ్వాలనే డిమాండ్‌ ఓటర్ల నుంచే వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు కోట్లాది రూపాయలు పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా? అని స్థానిక రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటకు రూ.1500 నుంచి రూ.2 వేలు పంపిణీ చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల కొందరికి ఓటుకు రూ.5 వేలు కూడా ఇవ్వవలసిన పరిస్థితులు నెలకొనడం గ్రామీణ ప్రాంత రాజకీయ నేతల్లో గుబులు రేపుతున్నది. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతంలో ఓటుకు రూ.500 ఇవ్వడం అనేది చాలా ఎక్కువగా భావిస్తూ వస్తున్నారు. చాలా చోట్ల రూ.200, అంతకు మించి రూ.300తో సరిపెట్టేవారు. గత 2019 ఎన్నికల్లో ఓటుకు రూ.500, అది కూడా పరిమిత స్థాయిలో పంపిణీ చేశారు. చాలా పంచాయతీల్లో కేవలం రూ.200తో సరిపెట్టారు. ఈసారి ఎన్నికలకు ముందునుంచే ఓటుకు రూ.1000, అంతకు మించి ఇవ్వాలనే డిమాండ్‌ ఓటర్ల నుంచే వచ్చింది. ఫలితంగా చోడవరంలాంటి ప్రాంతంలో కొందరు అభ్యర్థులు తమ ఆస్తులు కూడా తనఖా పెట్టవలసి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఎన్నికలు ముగిసేలోగా ఒక్కో అభ్యర్థి సుమారుగా రూ.20 కోట్లకు పైగా డబ్బులు ఖర్చు చేయాల్సి రావడం నేతలను బెంబేలెత్తిస్తున్నది. ఇందులో కొంత పార్లమెంట్‌ అభ్యర్థులు, పార్టీ సమకూర్చినప్పటికీ స్థానిక అభ్యర్థులు కూడా కార్యకర్తలకు, ర్యాలీలు ప్రచార కార్యక్రమాలకు భారీగా డబ్బులు ఖర్చులు చేయాల్సి రావడం కూడా గ్రామీణ ప్రాంత రాజకీయ నేతలను ఆలోచనలో పడేసిందని అంటున్నారు.

ఇలాగైతే మా ఆస్తులు అమ్ముకోవలసిందే?

అసెంబ్లీ ఎన్నికలకు చేసిన ఖర్చులు, ఓటర్ల డిమాండ్లు, రోజువారీ వ్యయాన్ని దగ్గర నుంచి చూసిన స్థానిక రాజకీయ నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సైతం ఓటర్లు ఇలాగే ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు డిమాండ్‌ చేయడంతో పాటు మద్యం, బిర్యానీలు సరఫరా చేయాల్సి వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఖర్చులు ఇలాగే ఉంటే ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముకోక తప్పదని అంటున్నారు. గతంలో గ్రామాల్లో సేవ చేసే నాయకులకు, లేదా గ్రామాల్లో పనులు చేసే, నిధులు తెచ్చే నాయకులకు గుర్తింపు ఉండేది. ప్రస్తుతం నిధులు తెచ్చి పనులు చేయించినా, సేవలందించినా ఎన్నికలకు వచ్చేసరికి డబ్బే ప్రధానం అన్నట్టుగా ఓటర్ల తీరు మారడం స్థానిక నేతల్లో గుబులు రేపుతోంది. ఇదే తీరు కొనసాగితే రానున్న రోజుల్లో డబ్బులున్న వారే పదవులు కొనుక్కొనే పరిస్థితి ఉంటుందని, సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 15 , 2024 | 01:08 AM