Share News

నగదు తీసుకెళ్తున్నారా...

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:06 AM

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని చోట్లా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నగదు తీసుకెళ్తున్నారా...

రూ.50 వేలకు మించితే ఆధారాలు చూపాల్సిందే

ఉక్కుటౌన్‌షిప్‌, ఏప్రిల్‌ 17:

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు అన్ని చోట్లా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు ప్రజలు తమతో పాటు తీసుకెళ్తున్న బ్యాగులు, ఇతర వస్తువులు సైతం క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరైనా రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే స్వాధీనం చేసుకుంటారు. కొన్నిసార్లు సొంత పనుల మీద ఇతర ప్రాంతాలకు నగదు తీసుకువెళ్తున్నా ఇబ్బందులు తప్పవు. ఎన్నికల నియమ, నిబంధనల మేరకు తగిన ఆధారాలతో అధిక మొత్తంలో నగదు తీసుకువెళ్లవచ్చు. ఆ వివరాలివి..

ఫైనాన్స్‌, చిట్టీల వ్యాపారులు

చిట్టీలు, ఫైనాన్స్‌ సంస్థల్లో ప్రతి రోజు భారీగా లావాదేవీలు జరుగుతాయి. కలెక్షన్‌ల ఏజెంట్‌ల వద్ద రూ.లక్షల్లో నగదు ఉంటుంది. వీరు ఆ రోజు చేసిన కలెక్షన్‌ పద్దులు, బాకీ ఉన్న నగదు, వసూలైన నగదు ఇలా అన్ని వివరాలతో పాటు కస్టమర్‌ల సంతకంతో కూడిన ప్రతులు తప్పనిసరిగా తమ వెంట ఉంచుకోవాలి.

బంగారు ఆభరణాల కొనుగోలు

శుభకార్యాలు నిర్వహించే సమయంలో బంగారు, ఇతర వస్తువులు కొనుగోలుకు నగదు తీసుకు వెళ్తారు. శుభకార్యాల కోసం నగదు తీసుకువెళ్లే వారు తమ వెంట శుభలేఖ ఉంచుకోవాలి. అదే విధంగా పోలీసులు అడిగిన అన్ని వివరాలకు పూర్తి సమాచారం ఇవ్వాలి.

బ్యాంకు లావాదేవీలు....

బ్యాంకు లావాదేవీలు రూ.50వేలకు మించితే ఆధారాలు చూపించాలి. చెక్కు ద్వారా నగదు విత్‌డ్రా చేస్తే చెక్కు జెరాక్స్‌, పాస్‌బుక్‌ దగ్గర ఉంచుకోవాలి. ఏటీఎం ద్వారా నగదు వీత్‌డ్రా చేస్తే ఏటీఎం స్లిప్‌లు జాగ్రత్తచేయాలి (కొన్ని బ్యాంకుల ఏటీఎంలో ప్రస్తుతం రోజు వారీ పరిమితి 20వేలుగా ఉంది). ఒకవేళ నగదు బ్యాంకులో డిపాజిట్‌ చేసేందుకు వెళ్లే ఆ నగదుకు సంబంధించిన అన్ని వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఎవరు, ఎందుకు ఇచ్చారో ఆధారాలుండాలి. పాస్‌బుక్‌ కూడా ఉండాలి.

ఆస్పత్రి బిల్లులు చెల్లింపులు

అత్యవసర సమయాల్లో అధికమొత్తంలో ఆస్పత్రి బిల్లులు చెల్లించక తప్పదు. ఇలాంటి సమయంలో రోగి మెడికల్‌ కేస్‌ షీట్‌, మెడికల్‌ సర్టిఫికెట్‌, ఆస్పత్రి బిల్లులకు సంబంధించి బిల్లులు అందుబాటులో ఉంచుకోవాలి.

విద్యాసంస్థల ఫీజులు

పిల్లల చదువుల కోసం సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు ఫీజు చెల్లించాలంటే నగదు తీసుకువెళ్లకు తప్పదు. నగదు ఎందుకు తీసుకువెళ్తున్నారనే విషయంలో సంబంధిత యాజమాన్యం రశీదులు ఉండాలి. నగదు చెల్లించకముందు ఫీజు కట్టాలనే నోటీసులు వెంట ఉంచుకోవాలి. అవసరమైనంత మేరకు ఆన్‌లైన్‌లో పే చేయడం మేలు.

Updated Date - Apr 18 , 2024 | 02:06 AM