Share News

రాగి పిండి కొనుగోలుకు కార్డుదారులు విముఖం

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:23 AM

పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందిస్తున్న రాగి పిండి కొనుగోలుకు బియ్యం కార్డుదారులు విముఖత చూపుతున్నారు.

రాగి పిండి కొనుగోలుకు కార్డుదారులు విముఖం

  • ఇప్పటివరకూ 14.2 శాతం మాత్రమే పంపిణీ

  • పిండి కాల పరిమితి రెండు నెలలే...

  • రేషన్‌ డీలర్లలో ఆందోళన

విశాఖపట్నం/గాజువాక/అక్కయ్యపాలెం, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి):

పౌర సరఫరాల సంస్థ ద్వారా సబ్సిడీపై అందిస్తున్న రాగి పిండి కొనుగోలుకు బియ్యం కార్డుదారులు విముఖత చూపుతున్నారు. రాగి పిండి తీసుకుంటే కార్డుదారుడికి కిలో బియ్యం తగ్గిస్తున్నారు. నగరంలో కొంతమంది మాత్రమే రాగి పిండి వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల ఇప్పటివరకు కేవలం 14.2 శాతం కార్డుదారులు మాత్రమే రాగి పిండి కొనుగోలు చేశారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా రాగి పిండి కిలో రూ.11కు కార్డుదారులకు అందించాలని ప్రతిపాదించి గత నెల నుంచి అమ్మకాలు ప్రారంభించారు. విశాఖ జిల్లాకు గత నెల 100 టన్నులు సరఫరా చేయగా, కార్డుదారుల నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో డీలర్ల వద్ద ఎక్కువగా నిల్వలు ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ నెలకు సంబంధించి రాగిపిండి కొనుగోలు చేయలేమని డీలర్లు చెప్పినా...పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చింది. జిల్లాలో డీలర్లకు 123.166 టన్నుల రాగిపిండి అందజేశారు. దీంతో డీలర్లు బియ్యం కోసం వచ్చే కార్డుదారులకు నచ్చజెప్పి కిలో చొప్పున ఇచ్చారు. జిల్లాలో 5.29 లక్షల కార్డుదారులు ఉండగా గురువారం నాటికి 60,414 మందికి (14.2 శాతం) 60.37 టన్నులు రాగి పిండి విక్రయించారు. ఇంకా రేషన్‌ డిపోల్లో మరో 60 టన్నుల వరకూ సరకు ఉంది. ఈ నెలకు సంబంధించి 18వ తేదీ వరకు సరకులు పంపిణీకి సమయం ఉంది. అయినా మొత్తం సరకు అమ్మలేమని డీలర్లు అంటున్నారు. కాగా, మార్చి నెలలో సరఫరా చేసిన వంద టన్నుల్లో మిగిలిపోయిన పిండిని ఈ నెలాఖరులోగా విక్రయించాలి. అలాగే ఈనెల వచ్చిన పిండిని వచ్చే నెలాఖరులోగా కార్డుదారులకు సరఫరా చేసేయాలి. లేనిపక్షంలో రాగిపిండి ఎందుకూ పనికిరాకుండా పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కిలో బియ్యం తగ్గిస్తామనడం వల్లే కార్డుదారులు ముందుకురావడం లేదని పలువురు వ్యాఖ్యానించారు. సాధారణంగా ఎక్కువ మంది కార్డుదారులు బియ్యం బయట అమ్ముకుంటారు. రాగిపిండి వల్ల ఒక కిలో సొమ్ము కోల్పోవలసి వస్తోందని గాజువాకకు చెందిన కార్డుదారుడొకరు అభిప్రాయపడ్డారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి గూన సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ ప్రతి కార్డుదారుడు రాగిపిండి కొనుగోలు చేసేలా నచ్చజెప్పాలని ఎండీయూలకు సూచించామన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 01:23 AM