Share News

ఎడాపెడా రైళ్ల రద్దు

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:16 AM

కేంద్ర ప్రభుత్వం రైల్వేలో సొంత మార్కు కోసం యత్నిస్తూ ప్రయాణికులు బాగా అలవాటుపడిన సాధారణ రైళ్లను ఎడాపెడా రద్దు చేస్తోంది.

ఎడాపెడా రైళ్ల రద్దు

రద్దీ సమయాల్లోను అదే తీరు

ఇటు ప్రయాణికులకు కష్టం...అటు రైల్వేకు నష్టం

భద్రత, మౌలిక వసతుల పనుల కోసమా? లేక కొత్త రైళ్లకు ఆక్యుపెన్సీ పెంచేందుకా??

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం రైల్వేలో సొంత మార్కు కోసం యత్నిస్తూ ప్రయాణికులు బాగా అలవాటుపడిన సాధారణ రైళ్లను ఎడాపెడా రద్దు చేస్తోంది. ఆధునిక వసతులు, అత్యధిక వేగం పేరుతో కొత్త రైళ్లను తీసుకువచ్చి భారీగా ఆదాయం సమకూర్చుకుంటోంది. వందేభారత్‌ వంటి రైళ్లకు రద్దీ పెంచడానికి ఆ సమయంలో రెగ్యులర్‌గా నడిచే రైళ్లను తరచూ రద్దు చేస్తోంది. ఎక్కువ చార్జీలు అయినా సరే ప్రయాణికులు వాటినే ఆశ్రయించేలా చేస్తోంది. దీనికి అనేక సాకులు చూపుతోంది. రైల్వే లైన్లను ఆధునికీకరిస్తున్నామని, భద్రత, మౌలిక వసతుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అందుకే రైళ్లను రద్దు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తోంది. పండుగలు, సెలవుల సమయాల్లో కూడా రెగ్యులర్‌ రైళ్లను రద్దు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రమంగా ఆయా రైళ్లను సర్వీసు నుంచి తొలగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు రైళ్లు ఎందుకు రద్దు చేస్తున్నారు?, కారణాలు ఏమిటి?, గత ఏడాది మే నుంచి విశాఖపట్నం నుంచి బయలుదేరే రైళ్లను ఎన్నిసార్లు రద్దు చేశారో వివరాలు కావాలంటూ దువ్వాడ రైల్వే వినియోగదారుల సంఘం ప్రతినిఽధి కంచుమూర్తి ఈశ్వర్‌ సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించినప్పుడు వాల్తేరు డివిజన్‌ అధికారులు కళ్లు చెదిరిపోయే వివరాలు అందించారు. విశాఖపట్నం నుంచి కాకినాడ, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, తిరుపతిల మధ్య తిరిగే రెగ్యులర్‌ రైళ్లను కొన్ని వందలసార్లు రద్దు చేసినట్టు వెల్లడించారు. వీటి వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడగంతో పాటు రైల్వే ఆదాయానికి కూడా భారీగా గండి పడింది.

మే 2023 నుంచి డిసెంబరు 17 వరకు రద్దు చేసిన రైళ్ల వివరాలు

- మచిలీపట్నం-విశాఖపట్నం-మచిలీపట్నం మధ్య 17219/20 నంబరుతో నడిచే రైలును తూర్పు కోస్తా రైల్వే 13 సార్లు రద్దు చేయగా, దక్షిణ మధ్య రైల్వే 169 సార్లు రద్దు చేసింది.

- కాకినాడ-విశాఖపట్నం-కాకినాడల మధ్య 17267/68 నంబరుతో నడిచే రైలును తూర్పు కోస్తా రైల్వే 14 సార్లు, దక్షిణ మధ్య రైల్వే 284 సార్లు రద్దు చేశాయి.

- తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి మధ్య 22708/707 నంబరుతో తిరిగే రైలును తూర్పు కోస్తా రైల్వే 2 సార్లు, దక్షిణ మధ్య రైల్వే 34 సార్లు రద్దు చేశాయి.

- విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం మధ్య 12717/718 నంబరుతో నడిచే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దక్షిణ మధ్య రైల్వే 59 సార్లు రద్దు చేసింది.

- సికింద్రాబాద్‌-విశాఖపట్నం-సికింద్రాబాద్‌ల మధ్య 12740/39 నంబరుతో నడిచే గరీభ్‌రథ్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే 271 సార్లు రద్దు చేసింది.

- విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే 44 సార్లు రద్దు చేసింది.

- గుంటూరు-విశాఖపట్నం-గుంటూరు మధ్య 17239/240 నంబరుతో నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలును తూర్పు కోస్తా రైల్వే 2 సార్లు, దక్షిణ మధ్య రైల్వే 284 సార్లు రద్దు చేశాయి

- విశాఖపట్నం-విజయవాడ-విశాఖపట్నం మధ్య నడిచే డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను తూర్పు కోస్తా రైల్వే కేవలం రెండుసార్లు రద్దు చేయగా, దక్షిణ మధ్య రైల్వే 264 సార్లు రద్దు చేసింది.

విమర్శల నేపథ్యంలో రెండు రైళ్ల తాత్కాలిక పునరుద్ధరణ

రైల్వే శాఖ తీరుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో ఈ సంక్రాంతి సీజన్‌ కోసమని రెండు రైళ్లను తాత్కాలికంగా పునరుద్ధరించింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే డబుల్‌ డెక్కర్‌ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 5 నుంచి 13వ తేదీ వరకు నడుపుతామని ప్రకటించింది. అలాగే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నడుపుతామని షెడ్యూల్‌ ఇచ్చారు. ఇవి కూడా తాత్కాలికంగానే నడపడం గమనార్హం.

Updated Date - Jan 05 , 2024 | 01:16 AM