జూనియర్ కళాశాల కల నెరవేరేనా?
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:01 AM
గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాల చేయాలని అయ్యన్నపాత్రుడు పెట్టిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. కాగా కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ రెసిడెన్సియల్ స్కూల్ జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- ఏపీ రెసిడెన్సియల్ స్కూల్‌ను జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేస్తూ 2019లో ప్రతిపాదనలు
- అయ్యన్నపాత్రుడు చొరవతో ప్రభుత్వానికి నివేదిక
- గత వైసీపీ పాలనలో పట్టించుకోని వైనం
- ప్రైవేటు సంస్థల్లో చదివించాలంటే ఫీజులు ఎక్కువ అని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
- కూటమి ప్రభుత్వంలో అప్‌గ్రేడ్ అవుతుందని ఆశాభావం
నర్సీపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాల చేయాలని అయ్యన్నపాత్రుడు పెట్టిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. కాగా కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ రెసిడెన్సియల్ స్కూల్ జూనియర్ కాలేజీగా అప్‌గ్రేడ్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో 1983లో నర్సీపట్నం ఏపీ రెడిడెన్సియల్ స్కూల్ (బాలురు)ను మంజూరు చేశారు. అయ్యన్నపాత్రుడు చొరవతో పెదబొడ్డేపల్లిలో మెయిన్ రోడ్డును ఆనుకొని 15 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటైంది. దీంతో పేద విద్యార్థులకు ఐదు నుంచి పదవ తరగతి వరకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రతీ ఏటా ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ 5 నుంచి 10వ తరగతి వరకు 465 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాణ్యమైన విద్యా బోధన కారణంగా ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలలో దేశ, విదేశాలలో స్థిరపడ్డారు. ఇక్కడ పదవ తరగతి పూర్తి చేసిన తరువాత విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అధిక శాతం మంది ప్రైవేటు జూనియర్ కళాశాలలో చేరుతున్నారు. గురుకుల పాఠశాలను రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేస్తే ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువు పూర్తి చేసి ఒకేసారి బయటకు రావచ్చు. ఎక్కువ ఫీజులు చెల్లించి ప్రైవేటు కళాశాలలో చదివించుకునే అవసరం లేకుండా ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రైవేటు కళాశాలలో చదివించుకోవాలంటే హాస్టల్‌తో కలిపి రూ.2 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వాపోతున్నారు.
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతిపాదనలు
అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి అయ్యన్నపాత్రుడు 2019లో ఏపీ రెసిడెన్సియల్ స్కూల్‌ను ఏపీ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదించారు. దీనిని ఏపీ రెసిడెన్సియల్ స్కూల్ సొసైటీ.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. ఇంతలో ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రతిపాదన మరుగున పడిపోయింది. గురుకుల బాలుర పాఠశాలకు కళాశాల యోగం పడుతుందని ఆశించిన విద్యార్థులకు నిరాశే మిగిలింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టి పెడితే జూనియర్ కళాశాల కల సాకారం అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.