బై బై వైసీపీ
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:54 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలకవర్గంలో అలజడి మొదలైంది.
అధికార పార్టీని వీడుతున్న కార్పొరేటర్లు
ఒకరి తర్వాత ఒకరు బయటకు...
ఇప్పటికే ఇద్దరు జనసేనలో చేరిక
త్వరలో మరో నలుగురు కార్పొరేటర్లు రాజీనామా
టీడీపీలో చేరే అవకాశం
నేడో..రేపో అధికారికంగా ప్రకటన
అదేబాటలో మరో పది మంది కార్పొరేటర్లు
టీడీపీ, జనసేనల్లో చేరనున్నట్టు ప్రచారం
జీవీఎంసీ పాలకవర్గం పెద్దల్లో అలజడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాలకవర్గంలో అలజడి మొదలైంది. అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కూడా పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
మూడేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులను గెలుచుకోగా, టీడీపీ 30 వార్డులను గెలుచుకుంది. జనసేన మూడు, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు దక్కించుకున్నాయి. నాలుగుచోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. దీంతో వైసీపీకి చెందిన 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారిని మేయర్‌గా ఎంపిక చేశారు. దాదాపు మూడేళ్లపాటు జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ ఆధిపత్యానికి అడ్డేలేకుండా పోయింది. జీవీఎంసీకి, నగరవాసులకు ఎంత ఇబ్బంది కలిగించే అంశమైనప్పటికీ సంఖ్యాబలంతో ఏకగ్రీవంగా ఆమోదించుకుంటూ వచ్చారు. వైసీపీ కార్పొరేటర్లలో చాలామంది పార్టీ నేతల తీరు పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో బయటపెట్టకుండా వచ్చారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో కార్పొరేటర్లలో అసంతృప్తులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీలో ఇమడలేమంటూ టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఇండిపెండెంట్లుగా గెలిచి వైసీపీలో చేరిన ముగ్గురు కార్పొరేటర్లలో ఇద్దరు ఇటీవలే పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. జనసేన పార్టీలో చేరిపోయారు. తాజాగా దక్షిణ నియోజకవర్గానికే చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడాలని దాదాపు నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మంది కార్పొరేటర్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అనుచరులుగా కొనసాగుతున్నారు. సుధాకర్ ఇటీవలే పార్టీని వీడారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో 29వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్‌జైన్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్‌లు కూడా సుధాకర్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సుధాకర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు దసపల్లా హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో వారు కూడా పార్టీని వీడిపోవడం ఖాయమని పార్టీ నేతలు నిర్ధారణకు వచ్చారు. వీరితోపాటు అదే నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు, ఉత్తర నియోజకవర్గ పరిధిలోని ఒకరు, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒకరు, గాజువాక నియోజకవర్గ పరిధిలోని నలుగురు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడిపోవాలని భావిస్తున్నట్టు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. వీరంతా పార్టీని వీడిపోతే జీవీఎంసీ కౌన్సిల్‌లో తమ పార్టీ బలం తగ్గిపోతుందని పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే కౌన్సిల్‌లో పెట్టే అంశాలను ఆమోదించే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు.
త్వరలో వైసీపీకి పలువురు కార్పొరేటర్లు రాజీనామా
బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్
పార్టీని నమ్ముకున్న వారికి జగన్ న్యాయం చేయడం లేదని ఆరోపణ
పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చు చేసినా పట్టించుకోలేదని విమర్శ
గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్లు పలువురు త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన బుధవారం దసపల్లా హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైసీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు ఉరుకూటి నారాయణరావు, బిపిన్‌కుమార్ జైన్, చెన్నా జానకీరామ్, విల్లూరి భాస్కరారావు (వైసీపీ మద్దతుదారు)లతో కలిసి మాట్లాడారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ అభివృద్ధిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ న్యాయం చేయడం లేదని, దానికి తానే ప్రత్యక్ష నిదర్శనమని సుధాకర్ అన్నారు. జగన్ తండ్రి రాజశేఖర్‌రెడ్డి వద్ద, ఆయన తల్లి విజయలక్ష్మి వద్ద కూడా తాను ఎన్నికల సమయాల్లో చాలా కీలకంగా పనిచేశానన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఉత్తరాంధ్ర స్థాయి నాయకులందరినీ పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించానని, కొన్ని కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేశానన్నారు. అయితే తనది వన్ సైడ్ లవ్‌గానే ఉండిపోయిందని, న్యాయం జరగలేదని, అందుకే ఆ పార్టీకి, ఆ పార్టీ ఇచ్చిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చానన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా న్యాయం జరగలేదనే బయటకు వచ్చారన్నారు. తామంతా కలిసి విశాఖలో వైసీపీ నుంచి నాయకులను బయటకు తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. త్వరలోనే తాను వేరే పార్టీలో చేరతానని, అయితే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం కాదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి తన కాలేజీలో సంక్రాంతి సందర్భంగా పార్టీ కేడర్‌కు మద్యం, కోళ్లు పంపిణీ చేయించారని, ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. ఆ మద్యం అంతా చీప్ లిక్కర్ అని, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలే ఆ చీప్ లిక్కర్ తయారుచేయించి అమ్మిస్తున్నారని ఆరోపించారు.