Share News

ఇలా చేస్తే కాఫీ అధిక దిగుబడులు

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:12 PM

జిల్లాలో ఆదివాసీ రైతులు నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించేందుకు వేసవి సస్యరక్షణ చాలా కీలకమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలా చేస్తే కాఫీ అధిక దిగుబడులు
పూతకొచ్చిన కాఫీతోట(ఫైల్‌)

వేసవి సస్యరక్షణ కీలకం

ఎండు, పొడవైన కొమ్మలు తొలగించుకోవాలి

నాట్లు కోసం గోతులు సిద్ధం చేసుకోవాలి

ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ సూచన

చింతపల్లి, ఏప్రిల్‌ 7: జిల్లాలో ఆదివాసీ రైతులు నాణ్యమైన కాఫీ దిగుబడులు సాధించేందుకు వేసవి సస్యరక్షణ చాలా కీలకమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర ప్రధాన వాణిజ్య పంటగా కాఫీ సాగు చేపడుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గిరిజన రైతులు 2.42 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. ఆదివాసీ రైతులు కాఫీ సాగులో వేసవి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన దిగుబడి పొందలేకపోతున్నారని ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం రైతులు తోటల్లో కాఫీ పండ్ల కోత పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెలలో కురిసే తొలకరి వర్షాలకు కాఫీ మొక్కల్లో పూత కూడా ప్రారంభంకానున్నది. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు వేసవిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ పలు సూచనలు చేశారు.

ఫైర్‌లైన్‌ క్లియరెన్స్‌

వేసవిలో కాఫీ తోటలు అగ్నిప్రమాదానికి గురికాకుండా రైతులు ఫైర్‌లైన్‌ క్లియరెన్స్‌ పనులను చేసుకోవాలి. కాఫీ తోట నలుదిక్కులా ఎండిపోయిన ఆకులు, కొమ్మలను తొలగించుకోవాలి. కనీసం కాఫీ తోటల అంచుల చుట్టూ మూడు అడుగుల విస్తీర్ణం కలిగిన బాటలను ఏర్పరచుకుని ఎండు ఆకులు, ఎండు కొమ్మలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాఫీ తోటలు కలిసి వుంటే ప్రతీ తోట మధ్యలో మూడు అడుగులు వెడల్పు కలిగిన ఫైర్‌లైన్‌ క్లియరెన్స్‌ పనులు చేసుకోవాలి.

కొమ్మల కత్తిరింపు

కాఫీ సాగులో కొమ్మల కత్తిరింపు చాలా కీలకం. ఏప్రిల్‌, మే నెల్లో కాఫీ మొక్కలపైన కొత్తగా వచ్చిన నిటారు లేతకొమ్మలను ఏటవాలుగా కత్తిరించుకోవాలి. అలాగే అడ్డదిడ్డంగా(ఒక కొమ్మపై మరో కొమ్మ కలిగి వుంటే)వున్న కొమ్మలను కూడా కత్తిరించుకోవాలి. ఈ కొమ్మలపై వచ్చిన నిటారు(గుర్రపుడెక్క) కొమ్మలను కూడా కత్తిరించుకోవాలి. ప్రతీ కొమ్మకు కాంతి తగిలేలా చూసుకోవాలి. ఎండు కొమ్మను కూడా తొలగించుకోవాలి. ఒక మొక్కలో 12-13 బలమైన దిగుబడినిచ్చే కొమ్మలు మాత్రమేవుండేలా చూసుకోవాలి. ఈ విధంగా కొమ్మల కత్తిరింపు పనులు చేసుకోవడం వల్ల దిగుబడినిచ్చే కొమ్మలకు పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. దీంతో కాఫీ దిగుబడి పెరుగుతుంది. నేల నుంచి రెండు అడుగులలోపు ప్రధాన కాండానికి ఇరువైపులా కొమ్మలు లేకుండా చూసుకోవాలి.

కలుపు నివారణ, అంతర్‌ కృషి

కాఫీ తోటల్లో కలుపు(అనవసరమైన మొక్కలు)ను తొలగించుకోవాలి. అలాగే మూడేళ్లలోపు మొక్కల చుట్టూ గొప్పుచేసుకుని గూడు కట్టుకోవడం మంచిది. మూడేళ్లలోపు మొక్కలకు రెండు కిలోల పశువుల గెత్తం వేసుకోవాలి. అలాగే నాలుగేళ్ల పైబడిన ఒక్కొక్క మొక్కకు ఐదు కిలోల పశువుల గెత్తం వేసుకొని మొక్కల చుట్టూ గొప్పుచేసుకోవాలి.

కాండం తొలుచు పురుగు నివారణ కోసం..

కాఫీ మొక్కలకు సరైన నీడ లేకపోతే కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. మొక్కలపై ఎండ ప్రభావం ఎక్కువగా వుంటే ఈ పురుగు వ్యాప్తి అధికంగా వుంటుంది. ఈ పురుగు ప్రధానంగా మొక్క ప్రధాన కొమ్మపై వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వందల సంఖ్యలో కాండం తొలుచు పురుగులు బయటకొచ్చి పంటను నాశనం చేసే ప్రమాదముంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు మొక్కల ప్రధాన కాండం కింద నుంచి పైభాగం వరకూ కొబ్బరిపీచు, గోనె సంచితో నునుపుగా చేసుకోవాలి. కాండాన్ని నునుపుగా చేసుకోవడం వల్ల కాండం తొలుచు పురుగు మొక్కకాండంపై గుడ్లుపెట్టినా అవి మొక్క కిందకు రాలిపోతాయి. ఈ పురుగు ప్రధాన కాండానికి చిన్న రంధ్రం చేసుకుని లోపలకు ప్రవేశిస్తుంది. కాండంలోనున్న పోషకాలను పీల్చివేస్తుంది. కాండం తొలుచు పురుగు ఆశించిన మొక్కల నుంచి కాఫీ దిగుబడి రాదు. ఈ మొక్కలను రైతులు గుర్తించి పూర్తిగా తొలగించుకుని కాల్చివేయాలి. ఈ మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటుకోవాలి. అలాగే కాఫీ తోటకు పూర్తి స్థాయిలో నీడను కల్పించేందుకు నీడనిచ్చే మొక్కలను పెంపొందించుకోవాలి.

బోర్డో మిశ్రమంతో తెగుళ్ల నివారణ

కాఫీ పంటలో తెగుళ్లను నివారించుకునేందుకు వేసవిలో బోర్డో మిశ్రమం పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమం పిచికారీ చేసుకోవడం వల్ల ఆకుమచ్చ తెగులు, పొలుసు పురుగు, కాండం తొలుచు పురుగులను నియత్రించుకోవచ్చు. అలాగే 1500 సీసీఎం వేపనూనె 5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేసుకోవాలి.

Updated Date - Apr 07 , 2024 | 11:12 PM