Share News

సీఎం సభకు బస్సులు.. ప్రజలకు అవస్థలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:09 AM

ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధం పేరుతో సంగివలసలో నిర్వహించిన బహిరంగ సభకు జన సమీకరణ కోసం ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వేయ డంతో ప్రయాణికులు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు.

సీఎం సభకు బస్సులు.. ప్రజలకు అవస్థలు

సింహాచలం/తగరపువలస, జనవరి 27 : ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధం పేరుతో సంగివలసలో నిర్వహించిన బహిరంగ సభకు జన సమీకరణ కోసం ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వేయ డంతో ప్రయాణికులు బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. శనివారం కావడంతో వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ ఉంటోంది. అయితే సీఎం సభకు సింహాచలం డిపో నుంచి 42 బస్సులను తరలించడంతో భక్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవడంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి, గమ్య స్థానాలకు చేరుకున్నారు. బస్సులను సీఎం సభకు తరలించడంతో సింహాచలం డిపోకు రూ. 3.2 లక్షల వరకు ఆదాయం నష్టం వచ్చింది. భీమిలి పరిసర ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో ఆ బస్సులన్నీ ప్రజల్ని సభకు తరలించడానికి ఉపయోగించారు. ఈ రూటులో 222 నంబరు ఆర్‌టీసీ బస్సలను తగ్గించడం వల్ల ఉదయం వరకు కొద్దిగా ఇబ్బంది పడగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. మధురవాడ, కొమ్మాది, బోయిపాలెం క్రాస్‌ రోడ్డు ప్రాంతాల నుంచి చాలా మంది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళుతుంటారు. 111 నంబరు బస్సులు కూడా తగ్గించారు. దీంతో చాలా మంది ఆటోలపై రాకపోకలు సాగించారు. విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చే బస్సులను కూడా సాయంత్రం 4 గంటల తర్వాత నిలుపుదల చేసి వెనక్కి పంపించివేయ డం వల్ల సంగివలస-తగరపువలస రూటులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి సమావేశం పూర్తయ్యే సమయంలో ట్రాఫిక్‌ అంతరాయం వల్ల కొన్ని కార్లను తగరపువలస నుంచి భీమిలి మీదుగా మళ్లించారు.

Updated Date - Jan 28 , 2024 | 12:09 AM