Share News

దొడ్డిదారి బదిలీలకు బ్రేక్‌

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:11 AM

ఎన్నికల ముందు విద్యా శాఖ చేపట్టిన దొడ్డిదారి బదిలీలకు ఉన్నతాధికారులు చెక్‌ పెట్టారు.

దొడ్డిదారి బదిలీలకు బ్రేక్‌

ఉమ్మడి జిల్లాలో 69 మంది టీచర్లకు షాక్‌

నగర పరిసరాల్లో పోస్టింగ్‌ కోసం ఎన్నికల ముందు వైసీపీ నేతలకు రూ.లక్షలు సమర్పించుకున్న ఉపాధ్యాయులు

అప్పట్లో ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో జూన్‌ నుంచి పోస్టింగ్స్‌ ఇవ్వాల్సిందిగా ముందస్తు ఉత్తర్వులు

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వాటిని రద్దు చేస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఆదేశాలు

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

ఎన్నికల ముందు విద్యా శాఖ చేపట్టిన దొడ్డిదారి బదిలీలకు ఉన్నతాధికారులు చెక్‌ పెట్టారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్‌ 12వ తేదీ వరకు జారీచేసిన మొత్తం ఎనిమిది ప్రొసీడింగ్స్‌కు రద్దు చేస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల అనంతరం...అంటే జూన్‌ తరువాత బదిలీ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దని డీఈవోలకు కమిషనర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 69 మంది ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు రద్దయ్యాయి. దీంతో బదిలీల కోసం సగటున నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ముడుపులు ఇచ్చిన ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు.

ఉపాధ్యాయుల అక్రమ బదిలీల వ్యవహారంలో ఉత్తరాంధ్రకు చెందిన కీలక వ్యక్తి, ఆయన సహాయకుడు సొమ్ములు వసూలు చేశారని ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత టీచర్ల బదిలీల విషయంలో అనేకసార్లు సాక్షాత్తూ సీఎం పేషీ, మంత్రులు అడ్డగోలుగా వ్యవహరించారు. కౌన్సెలింగ్‌ ద్వారా మాత్రమే బదిలీలు చేపట్టాల్సి ఉండగా, అస్మదీయులైన వ్యక్తుల ద్వారా వచ్చిన టీచర్లను ప్రభుత్వ ఉత్తర్వుల పేరిట కోరుకున్నచోట పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఓ కీలక నేత, ఆయన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకుడు...ఎవరికి వారు సొంతంగా కౌంటర్లు పెట్టి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. బదిలీల కోసం నగరంలోని రైల్వేన్యూకాలనీలో ఉంటున్న అధికార పార్టీ నేత వ్యక్తిగత సహాయకుడి ఇంటికి టీచర్లు భారీగా క్యూకట్టేవారు. నగర పరిసరాల్లో పోస్టింగ్‌ కోసం అడిగినంత ఇచ్చేవారు. కొందరు నగర పరిసరాల్లో ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు బదిలీ కోసం రూ.లక్షలు పోశారు. విశాఖ పరిసరాల్లో పోస్టింగ్‌ కోసం పోటీ పెరగడంతో రేటు పెంచేసి కొందరి వద్ద ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకూ తీసుకున్నారు.

ప్రభుత్వ పెద్దలు నగర పరిసరాలు, శివారు ప్రాంతాల్లో ఖాళీలు లేకపోయినా భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలను ముందుగానే గుర్తించి అక్కడకు పోస్టింగ్స్‌ ఇచ్చారు. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి బదిలీ ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం ప్రారంభించారు. బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నామని, అయితే ప్రతి నెలలో ఏర్పడే ఖాళీలను పరిగణనలోకి తీసుకుని జూన్‌, జూలై, ఆగస్టు నెల వరకు విధుల్లో చేరడానికి అనుమతి ఇస్తున్నామని, ఆ మేరకు డీఈవో చర్యలు తీసుకోవాలని ఉన్నతాఽధికారులు ఆదేశించారు. విచిత్రం ఏమిటంటే...ఎన్నికల కోడ్‌ వచ్చిన తరువాత కూడా రెండు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారంటే ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ 12 వరకు మొత్తం ఎనిమిది ప్రొసీడింగ్స్‌ మేరకు ఉమ్మడి జిల్లాలో 82 మంది టీచర్లను దొడ్డిదారిన బదిలీ చేశారు. ఉత్తర్వులు వచ్చినా నగర పరిసరాల్లో ఖాళీలు లేకపోవడంతో పలువురు డీఈవో కార్యాలయం చుట్టూ తిరిగారు. అందులో 13 మంది మాత్రం తమకున్న పలుకుబడి ఉపయోగించి ప్రతినెలా ఏర్పడే ఖాళీల్లో నియమితులయ్యారు. ఇంకా 69 మంది మిగిలిపోయారు. ఈలోగా ఎన్నికల ప్రక్రియ ఊపందుకోవడం, పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో టీచర్లకు పోస్టింగ్స్‌ ఇవ్వలేదు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి తెలుగుదేశం అఽధికారంలోకి రావడంతో అక్రమ బదిలీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆ 69 మంది టీచర్లు షాక్‌కు గురయ్యారు. బదిలీల కోసం ఇచ్చి సొమ్ములు పోయినట్టేనని ఒక టీచర్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

Updated Date - Jun 07 , 2024 | 01:11 AM