Share News

ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ?

ABN , Publish Date - Jan 11 , 2024 | 01:38 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి పేరు ఖరారు చేసినట్టు బుధవారం జోరుగా ప్రచారం జరిగింది. గురువారం లేదా శుక్రవారం విడుదల చేసే మూడో జాబితాలో ఆమె పేరు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి జాబితాలో జిల్లాలో ఎవరెవరికి టికెట్లు దక్కుతాయనే దానిపై పార్టీ నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ?

పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం

నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి పేరు ఖరారు చేసినట్టు బుధవారం జోరుగా ప్రచారం జరిగింది. గురువారం లేదా శుక్రవారం విడుదల చేసే మూడో జాబితాలో ఆమె పేరు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి జాబితాలో జిల్లాలో ఎవరెవరికి టికెట్లు దక్కుతాయనే దానిపై పార్టీ నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నగర పరిధిలో వైసీపీకి అంత పట్టులేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా నగరంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. విశాఖ ఎంపీ స్థానానికి ముక్కోణ పోటీ జరగడంతో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌పై గెలుపొందారు. అయితే ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈసారి అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడంతో అధిష్ఠానం ఇటీవల తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. దీంతో అధికార పార్టీ ఎంపీ అభ్యర్థిని కొత్తగా చూసుకోవాల్సి వచ్చింది. కొంతమంది నేతలను అడిగినా ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావులను ఎంపీగా పోటీ చేయాల్సిందిగా అధిష్ఠానం కోరగా... ఇద్దరూ ససేమిరా అన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పొరుగు జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విజయనగరం మాజీ ఎంపీ ఝాన్సీ పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే పొరుగు జిల్లా నుంచి అభ్యర్థిని తీసుకురావాలనే ప్రతిపాదనపై పార్టీలో కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఏనాడూ విశాఖ రాజకీయాల్లో కనిపించని ఆమెను ఎన్నికలకు మూడు నెలల ముందు తీసుకొచ్చి అభ్యర్థిగా దింపడం వల్ల ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jan 11 , 2024 | 01:38 AM