Share News

విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:38 PM

మండలంలో వైరల్‌ ఫీవర్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆస్పత్రి పాలవుతున్నారు.

విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు
రోగులకు పరిక్షిస్తున్న డాక్టర్‌ నిఖిల్‌

రోగులతో ఆస్పత్రి కిటకిట

రోజురోజుకు పెరుగుతున్న ఓపీ

వాతావరణ మార్పులే కారణం

పెదబయలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో వైరల్‌ ఫీవర్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఆస్పత్రి పాలవుతున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శుక్రవారం రోగులతో కిటకిటలాడింది. వారపు సంత రోజే కాకుండా సాధారణ రోజుల్లో అవుట్‌ పేషెంట్లు పెరిగారు. వీరిలో వైరల్‌ జ్వరపీడితులు అధికంగా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పీహెచ్‌సీకి సాధారణ రోజుల్లో 80 నుంచి 100 ఓపీ నమోదు కాగా.. సోమవారం వారపు సంత రోజు ఏకంగా 250 వరకు ఓపీ నమోదైందని పీహెచ్‌సీ డాక్టర్‌ నిఖిల్‌ తెలిపారు. రోగుల్లో అధికంగా దగ్గు, జలుబు, జ్వరం, వంటి నొప్పులు, వాంతులు, విరేచనలతో ఆస్పత్రికి వస్తున్నారన్నారు. చలి కాలం ప్రారంభం కావడంతో వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్‌ జ్వరాలు వస్తున్నాయన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ప్రతి రోజూ పదుల సంఖ్యలో పీహెచ్‌సీకి వస్తున్నారని, ఈ వైరల్‌ జ్వరాలకు దూరంగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలన్నారు. వైరల్‌ జ్వరాల లక్షణాలు ఉన్నట్టయితే తక్షణమే పీహెచ్‌సీకి తీసుకురావాలని వైద్యుడు డాక్టర్‌ నిఖిల్‌ కోరారు.

పాటించ వలసిన జాగ్రత్తలు

వాతావరణంలో మార్పుల కారణంగా ఏజెన్సీ ప్రాంతమంతా చలి గాలులు వీస్తుండడంతో ఉన్ని దుస్తులు ధరించడం, ఉదయం పూట మంచు కురుస్తున్నందున మాస్కులు, మంకి కేప్స్‌ వంటివి ధరించి ప్రయాణాలు చేయాలి. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి. నీటి నిల్వ ఉండే ప్రాంతాలు, చెత్త, చెదారం నిల్వ ఉండే ప్రాంతాలు శుభ్రం చేయాలి. కాచిన నీటిని మాత్రమే తాగాలి.

Updated Date - Oct 25 , 2024 | 11:38 PM