Share News

పాఠశాలలకు పుస్తకాలు

ABN , Publish Date - May 24 , 2024 | 12:44 AM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు గాజువాక ఆటోనగర్‌లో గల గోదాముకు చేరుకుంటున్నాయి

పాఠశాలలకు పుస్తకాలు

ఉమ్మడి జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 21,71,180 పాఠ్య పుస్తకాలు అవసరం

ఇప్పటివరకూ 6,20,000 రాక

మండలాలకు పంపుతున్న అధికారులు

గాజువాక/ఆటోనగర్‌, మే 23:

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు గాజువాక ఆటోనగర్‌లో గల గోదాముకు చేరుకుంటు న్నాయి. ఇక్కడ నుంచి అధికారులు పాఠశాలలకు పంపుతున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 46 మండలాల్లో గల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు 21,71,180 పుస్తకాలు అవసరం. అయితే ఇప్పటివరకూ గాజువాకలో గల జిల్లా పాఠ్య పుస్తక విక్రయ కేంద్రం గోదాముకు మూడో వంతు కంటే తక్కువ...కేవలం 6,20,000 వరకూ మాత్రమే వచ్చాయి. గత ఏడాది మిగిలిపోయినవి రెండు లక్షల వరకూ ఉన్నాయి. మొత్తం కలిపితే 8,20,000. ప్రస్తుతం వీటిని ఆర్టీసీ కార్గో సర్వీస్‌లలో అన్ని మండలాలకు పంపుతున్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ చేసేందుకు కార్గో సర్వీస్‌ను జిల్లా ఉప విద్యాశాఖాధికారిని స్వర్ణలత రెండు రోజుల క్రితం ప్రారంభించారు.

ఇదిలావుండగా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు (నాలుగో తరగతి మినహా) పాఠ్య పుస్తకాలు ప్రస్తుతం కార్యాలయానికి చేరాయి. ఇవి కూడా తక్కువగానే వచ్చాయి. ఈ వారంలోగా పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు వచ్చే అవకాశం ఉందని జిల్లా పాఠ్యపుస్తకాల డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఆయా పాఠశాలలు ఇచ్చిన ఇండెంట్‌ ఆధారంగా పాఠ్య పుస్తకాలు పంపుతున్నామన్నారు. కాగా ఈ ఏడాది 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు నేరుగా ఆయా మండలాల విద్యాశాఖాధికారుల కార్యాలయాలకు చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. జూన్‌ 12వ తేదీ నాటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలకు పంపిణీ చేసేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - May 24 , 2024 | 12:45 AM