Share News

చక్కెర కర్మాగారాలకు చేదు కాలం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:33 AM

‘‘మేం అధికారంలోకి వస్తే తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తాం. ఫ్యాక్టరీని యథావిధిగా నడుపుతాం.’’ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అనకాపల్లి పర్యటనకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీని తుంగలో తొక్కారు. ఆధునికీకరణ మాట అటుంచి.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయించి, ఖాయిలా పరిశ్రమల జాబితో చేర్చారు. ఇదే కాకుండా జిల్లాలో మరో రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు.. ఏటికొప్పాక, తాండవలను కూడా మూసివేయించారు. మిగిలిన ఒక్కగానొక్క గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఆధునికీకరణ, ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు హామీలు సైతం గాలిలో కలిసిపోయాయి.

చక్కెర కర్మాగారాలకు చేదు కాలం
మూత పడిన అనకాపల్లి వి.వి. రమణ కోఅపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ

తుమ్మపాల షుగర్స్‌ ఆధునికీకరణ హామీని తుంగలో తొక్కిన సీఎం జగన్‌

ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు శూన్యం

శాశ్వతంగా మూసివేత.. ఆస్తుల లిక్విడేషన్‌కు ఉత్తర్వులు

రూ.కోట్ల ఆస్తులను కారు చౌకగా అస్మదీయులకు కట్టబెట్టేందుకు యత్నాలు

కోర్టును ఆశ్రయించి అడ్డుకున్న చెరకు రైతులు

తుమ్మపాల బాటలోనే ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలు

మూడేళ్ల క్రితం మూసివేత

ఇంతవరకు అతీగతీలేని వైనం

గాలిలో కలిసిన గోవాడ షుగర్స్‌ ఆధునికీకరణ, ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు

వైసీపీ పాలకుల తీరుపై మండిపడుతున్న చెరకు రైతులు, ఫ్యాక్టరీల కార్మికులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

‘‘మేం అధికారంలోకి వస్తే తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని ఆధునీకరిస్తాం. ఫ్యాక్టరీని యథావిధిగా నడుపుతాం.’’ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అనకాపల్లి పర్యటనకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీని తుంగలో తొక్కారు. ఆధునికీకరణ మాట అటుంచి.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయించి, ఖాయిలా పరిశ్రమల జాబితో చేర్చారు. ఇదే కాకుండా జిల్లాలో మరో రెండు సహకార చక్కెర ఫ్యాక్టరీలు.. ఏటికొప్పాక, తాండవలను కూడా మూసివేయించారు. మిగిలిన ఒక్కగానొక్క గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ ఆధునికీకరణ, ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు హామీలు సైతం గాలిలో కలిసిపోయాయి.

గత సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా వున్న వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. పాదయాత్ర, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను ఐదేళ్లపాటు అధికారంలో వున్నప్పటికీ అమలు చేయలేదు. ప్రధానంగా సహకార చక్కెర ఫ్యాక్టరీల విషయంలో ‘మాట తప్పారు.. మడమ తిప్పేశారు’ అని చెరకు రైతులు, ఆయా ఫ్యాక్టరీల కార్మికులు, ఉద్యోగులు ఎద్దేవా చేస్తున్నారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మరోసారి మాయమాటలు, రకరకాల హామీలు గుప్పించి ఓట్లు దండుకొనేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలోని సహకార షుగర్‌ ఫ్యాక్టరీలు నష్టాల పట్టాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన వీవీ రమణ తుమ్మపాల (అనకాపల్లి) కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీతోపాటు ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలను నిర్వీర్యం చేశారు. తాము అధిఇకారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్‌రెడ్డి తుంగలో తొక్కారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరించకపోగా పూర్తిగా మూసివేయించారు. దివాలా పరిశ్రమగా ముద్ర వేశారు. ఫ్యాక్టరీకి చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులను లిక్విడేషన్‌ పేరుతో కారు చౌకగా అసమ్మదీయులకు కట్టబెట్టడానికి ప్రయత్నించారని కార్మికులు, రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు, టీడీపీ, సీపీఎం, జనసేన, రైతు సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. లిక్విడేషన్‌ ఆదేశాలపై కొంతమంది రైౖతులు కోర్టును ఆశ్రయించారు. యథాస్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఆస్తుల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది

చరిత్ర పుటల్లోకి తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ

అనకాపల్లి మండలం తుమ్మపాలలో 1937 ప్రాంతంలో గుజరాత్‌కి చెందిన కాంతీలాల్‌ అనే వ్యాపారి 450 టన్నుల సామర్థ్యంతో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. తరువాత దశల వారీగా విస్తరించారు. 1957లో రైతులు, కార్మికులతో ఏర్పడిన గొడవల కారణంగా యాజమాన్యం.. షుగర్‌ ఫ్యాక్టరీని తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం ప్రాంతానికి తరలించడానికి సిద్ధపడింది. నాటి రాజ్యసభ సభ్యుడు వి.వి.రమణ ప్రైవేటురంగంలోని ఫ్యాక్టరీని సహకార రంగంలోకి మార్పించారు. 1959 నుంచి ఇప్పటి వరకు సహకార రంగంలోనే కొనసాగుతున్నది. అయితే కాలక్రమేణా ఫ్యాక్టరీ యంత్ర పరికరాలు పాతబడిపోవడం, క్రషింగ్‌లో తరచూ సమస్యలు తలెత్తుతుండడంతో చెరకు క్రషింగ్‌, పంచదార రికవరీ శాతం తగ్గిపోతూ వచ్చాయి. దీంతో ఫ్యాక్టరీ నష్టాల బారినపడి మూడేళ్ల క్రితం మూతపడింది. తరువాత 2016-17 సీజన్‌లో టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఫ్యాక్టరీని తెరిపించింది. కానీ యంత్రాలు పాతబడిపోవడంతో పూర్తిస్థాయిలో క్రషింగ్‌ జరగలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, అంతకుముందు ఎన్నికల ప్రచారంలో తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని జగన్మోహన్‌రెడ్డి చెప్పడంతో సానుకూల నిర్ణయం తీసుకుంటారని రైతులు, కార్మికులు ఆశించారు. కానీ ఆధునికీకరణ మాట అటుంచి.. ఏకంగా ఫ్యాక్టరీని మూసివేయించారు. జిల్లా పునర్విభజన తరువాత అనకాపల్లి కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖాల మంత్రిగా నియమితులయ్యారు. సొంత నియోజకవర్గంలో సహకార షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించడానికి కనీస ప్రయత్నాలు చేయలేదు.

తుమ్మపాల బాటలో ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు

జిల్లాలో 2018 ఆగస్టు నెలలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి మహా సంకల్ప పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా తాండవ, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీల రైతులు, కార్మికులు ఆయనను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలను ఆధునీకరించి, పూర్వవైభవం తెస్తామని హామీ వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆధునికీకరణ హామీని మరచిపోయారు. రెండు సీజన్‌లలో మాత్రమే చెరకు క్రషింగ్‌ జరిగింది. 2021-22 సీజన్‌ తరువాత ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతులకు చెరకు బకాయిలు, కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు.. ఫ్యాక్టరీలను పునఃప్రారంభించలేదు. చెరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధి లేక కార్మికులు వీధిన పడ్డారు.

చెరకు సాగుకు స్వస్తి

- కొణతాల మోదినాయుడు, రైతు, తుమ్మపాల 18ఏకేపీ.2.

తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ నడుస్తున్నప్పుడు ఏటా 50 నుంచి 60 టన్నుల వరకు చెరకు సరఫరా చేశాను. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఫ్యాక్టరీని మూసేశారు. అప్పటికే పొలంలో చెరకు పైరు వుంది. రెండుళ్లపాటు గోవాడ, పాలకొండ షుగర్‌ ఫ్యాక్టరీలకు చెరకు తరలించాం. కానీ తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో చెరకు సాగు పూర్తిగా మానేశాను. వైసీపీ ప్రభుత్వం తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించకపోగా, ఆస్తుల అమ్మకానికి తెగబడడం శోచనీయం.

Updated Date - Apr 19 , 2024 | 12:33 AM