Share News

భీమిలి... విభిన్న శైలి!

ABN , Publish Date - Apr 21 , 2024 | 01:38 AM

చారిత్రక ప్రాధాన్యమున్న భీమునిపట్నం నియోజకవర్గం విభిన్న శైలిని సంతరించుకుంది.

భీమిలి... విభిన్న శైలి!

రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం

14 ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీకే జైకొట్టిన జనం

నాలుగసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు

ప్రస్తుతం రెండోసారి తలపడుతున్న గంటా శ్రీనివాసరావు

మూడోసారి పోటీలో ముత్తంశెట్టి శ్రీనివాసరావు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 3,58,511

పురుషులు: 1,75,870

స్త్రీలు : 1,82,626

థర్డ్‌ జండర్‌: 15

భీమునిపట్నం, ఏప్రిల్‌ 19:

చారిత్రక ప్రాధాన్యమున్న భీమునిపట్నం నియోజకవర్గం విభిన్న శైలిని సంతరించుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గంగా గుర్తింపును సాధించింది. 1952 నుంచి జరిగిన 14 ఎన్నికల్లో ఏకంగా ఆరుసార్లు తెలుగుదేశం పార్టీని ఆదరించింది. ఐదుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఇక్కడి నుంచి విజయం సాధించగా తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి సత్తా చాటారు. ప్రజా సోషలిస్టు పార్టీ, వైసీపీ ఒకసారి భీమిలి నుంచి గెలుపొందాయి.

స్వాతంత్ర్యానంతరం 1951 డీ లిమిటేషన్‌ ఆర్డర్స్‌ మేరకు భీమునిపట్నం శాసనసభ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించే సమయానికి 66,642 ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా 3,58,511 ఓటర్లున్నారు. 1952లో జరిగిన ఎన్నికల్లో భీమిలి పురపాలక సంఘం మాజీ చైర్మన్‌ కలిగొట్ల సూర్యనారాయణ నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పట్లో విశాఖ, విజయనగరం జిల్లాల సరిహద్దులో విస్తరించిన ఈ నియోజకవర్గం, తర్వాత జరిగిన పునర్విభజనతో విశాఖ జిల్లాకే పరిమితమయింది. భీమిలి అర్బన్‌, మండలం ఆనందపురం, పద్మనాభం మండలాలతో పాటు విశాఖ రూరల్‌ మండలంలోని కొన్ని గ్రామాలు చేరాయి. ఇప్పటివరకూ భీమిలిలో 14 సార్లు ఎన్నికలు జరగ్గా, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి, ప్రజా సోషలిస్టు పార్టీ ఒకసారి, కాంగ్రెస్‌ ఐదు సార్లు, తెలుగుదేశం ఆరు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి.

సత్తా చాటిన కలిగొట్ల

మొట్టమొదట 1952లో జరిగిన ఎన్నికల్లో భీమిలికి చెందిన మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ కలిగొట్ల సూర్యనారాయణనాయుడు స్వతంత్ర అభ్యర్థిగా, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా బొత్స ఆదినారాయణ, భారత జాతీయ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పూసపాటి మాధవవర్మ, చిట్టివలసకు చెందిన కార్మిక సంఘం నాయకుడు జేవీకే వల్లభరావు స్వతంత్రులుగా తలపడ్డారు. వీరిలో కలిగొట్లకు అత్యధికంగా 11,194 ఓట్లు, వల్లభరావుకు 10,200 ఓట్లు, బొత్సకు 8,156 ఓట్లు, మాధవ వర్మకు 5,769 ఓట్లు లభించాయి. 994 ఓట్ల మెజారిటీతో కలిగొట్ల గెలుపొందారు. తర్వాత 1956లో అలమండకు చెందిన గొట్టిముక్కల జగన్నాఽథరాజు (ప్రజా సోషలిస్టు పార్టీ), 1960 ఉపఎన్నిక, 1962, 1967 ఎన్నికల్లో విజయనగరం సంస్థానాధీశులు డా.రాజాసాహెబ్‌ పూసపాటి విజయరామ గజపతిరాజు (భారత జాతీయ కాంగ్రెస్‌), 1972 ఎన్నికల్లో పాండ్రంగికి చెందిన రాజాసాగి సోమ సుందర సూర్యనారాయణ రాజు (ప్రభు) కాంగ్రెస్‌(ఆర్‌), 1978 ఎన్నికల్లో మజ్జివలసకు చెందిన దాట్ల జగన్నాఽథరాజు(కాంగ్రెస్‌ ఐ) ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో పూసపాటి ఆనందగజపతిరాజు (తెలుగుదేశం), సిట్టింగ్‌ ఎమ్మెల్యే దాట్ల జగన్నాథరాజు(ఐఎన్‌సి) పోటీ చేశారు. వీరిలో ఆనందగజపతిరాజుకు 55,239 ఓట్లు, జగన్నాథరాజుకు 15,663 ఓట్లు లభించాయి. మొత్తం ఓట్లు 1,00,372 పోలవగా 70,902 ఓట్లు మాత్రమే చెల్లుబాటయ్యాయి. ఆనందగజపతిరాజు 39,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఆర్‌ఎస్‌డీపీ నాలుగు సార్లు విజయభేరి

పాండ్రంగి గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజా సాగి సోమసుందర సూర్యనారాయణరాజు సోదరుడు రాజాసాగి దేవీ ప్రసన్న అప్పలనరసింహరాజు (తెలుగుదేశం) 1985లో జరిగిన ఎన్నికల్లో రంగంలో దిగారు. ఆకెళ్ల శేషగిరిరావు (ఐఎన్‌సి) అభ్యర్థిగా, మరో ముగ్గురు స్వతంత్రులుగా పోటీ చేశారు. మొత్తం 1,10,828 ఓట్లు పోలవగా, 67,241 ఓట్లు చెల్లుబాటయ్యాయి. తెలుగుదేశం అభ్యర్థి ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజుకు 49,552 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకెళ్ల శేషగిరిరావుకు 15,406 ఓట్లు లభించాయి. అప్పలనరసింహరాజు 34,146 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 1989 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు (టీడీపీ) బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నుంచి జామి మండలానికి చెందిన వీరవెంకట సూర్యనారాయణరాజు, విశాఖకు చెందిన ఆళ్వార్‌దాస్‌ సుంకరి ఇద్దరూ బీఫారాలు తెచ్చుకోవడంతో ఎన్నికల అధికారులు ఇద్దరినీ ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అప్పలనరసింహరాజుకు 58,808 ఓట్లు, కాకర్లపూడికి 26,594 ఓట్లు, ఆళ్వార్‌దాస్‌కు 3,718 ఓట్లు లభించాయి. అప్పలనరసింహరాజు 32,214 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 1994 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా వేములవలసకు చెందిన కోరాడ శంకరరావు, బీజేపీ నుంచి కంచుబోయిన రామారావు, పి.రుద్రశేఖర్‌ (బీఎస్పీ), స్వతంత్ర అభ్యర్థులుగా గొల్లకోట విష్ణుమూర్తి, పూసపాటి మాధవవర్మ, కాకర్లపూడి వెంకట నరసింహరాజులు పోటీ పడ్డారు. వీరిలో అప్పలనరసింహరాజుకు అత్యధికంగా 64,726 ఓట్లు, శంకరరావుకు 27,877 ఓట్లు, రామారావుకు 5,916 ఓట్లు లభించాయి. దీంతో అప్పలనరసింహరాజు 36,849 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 1999 ఎన్నికల్లో మళ్లీ ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు (టీడీపీ), కోరాడ శంకరరావు (కాంగ్రెస్‌) అభ్యర్థులుగా రంగంలో దిగారు. వీరితో బాటు స్వతంత్ర అభ్యర్థిగా కాకర్లపూడి వెంకట నరసింహరాజు, అన్నా టీడీపీ అభ్యర్థిగా దారబాల వీరభద్రరావు రంగంలో నిలిచారు. అప్పలనరసింహరాజుకు 60,624 ఓట్లు, శంకరరావు 35,796 ఓట్లు లభించాయి. కాకర్లపూడికి 6,632, వీరభద్రరావుకు 1608 ఓట్లు వచ్చాయి. దీంతో అప్పలనరసింహరాజు 24,828 ఓట్లు ఆధిక్యతతో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2004లో మారిన పంథా

టీడీపీ కంచుకోటగా గుర్తింపు సాధించిన భీమిలి నియోజకవర్గ ప్రజలు తొలిసారి 2004లో విభిన్నమైన తీర్పును ఇచ్చారు. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ అప్పలనరసింహరాజునే అభ్యర్థిగా రంగంలోకి దింపింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా అడవివరం సర్పంచ్‌ కర్రి సీతారామును కాంగ్రెస్‌ పోటీలో నిలిపింది. మైలపల్లి నల్లయ్య (బీఎస్పీ), స్వతంత్ర అభ్యర్థులుగా సిరిపురపు సన్యాసినాయుడు, కర్రి వల్లభనారాయణ, పైడిరాజు కర్రి నిలిచారు. ఈ ఎన్నికల్లో కర్రి సీతారాముకు 57,619 ఓట్లు, అప్పలనరసింహరాజకు 57,318 ఓట్లు లభించగా, సీతారాము 241 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 2009లో మెగాస్టార్‌ చిరంజీవి రాజకీయ అరంగేట్రంతో ఆనందపురం ఎంపీపీ కోరాడ రాజబాబు ప్రజారాజ్యం పార్టీ టికెట్‌ ఆశించారు. అయితే ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఆ పార్టీ రంగంలోకి దింపింది. ప్రజారాజ్యం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ నుంచి నడింపల్లి ఆంజనేయరాజు, కాంగ్రెస్‌ నుం చి పీలా ఉమారాణి, స్వతంత్ర అభ్యర్థిగా కోరాడ రాజబాబు బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,23,147కాగా, 1,76,771 పోలయ్యాయి. ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు 52,130 ఓట్లు, ఆంజనేయరాజుకు 45,820, ఉమారాణికి 41,219, రాజబాబుకు 22,953 ఓట్లు లభించాయి. ముత్తంశెట్టి 6,310 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాము, కాంగ్రెస్‌ నుంచి చెన్నా దాసు, సకురు అనిత ఇండిపెండెంట్‌గా రంగంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,11,132 కాగా, గంటా శ్రీనివాసరావుకు 1,18,020 ఓట్లు లభించాయి. సీతారాముకు 80,794 ఓట్లు వచ్చాయి. 37,226 ఓట్లు భారీ ఆధిక్యతతో గంటా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, టీడీపీ నుంచి విశాఖ మాజీ మేయరు సబ్బం హరి, జనసేన అభ్యర్థిగా పంచకర్ల నాగ సందీప్‌, బీజేపీ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్‌ కోరాడ అప్పారావు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా తెడ్డు రామదాసు, జనజాగృతి అభ్యర్థిగా డి.ప్రభాగౌడ్‌, శివసేన అభ్యర్థిగా గండికోట రాజేష్‌, పిరమిడ్‌ పార్టీ తరపున కె.అచ్చింనాయుడు, కూన బాబూరావు, బక్కన్నపాలేనికి చెందిన బంక వెంకట అప్పారావులు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. ఈ ఎన్నికలో 3,05,958 ఓటర్లుండగా, ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు అత్యధికంగా 1,01,629, సబ్బంహరికి 91,917 ఓట్లు లభించాయి. జనసేన అభ్యర్థి సందీప్‌కు 24,248 ఓట్లు లభించాయి. ముత్తంశెట్టి 9,712 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

Updated Date - Apr 21 , 2024 | 01:39 AM