Share News

మందు చూపు!

ABN , Publish Date - May 12 , 2024 | 01:22 AM

ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనుండడంతో శనివారం ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. మందుబాబులు ముందు జాగ్రత్తగా ఆదివారం, సోమవారం నాటి కోసం మద్యం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.

మందు చూపు!
రావికమతంలో మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు

- మందుబాబుల ముందు జాగ్రత్త

- ఉదయం నుంచే మద్యం దుకాణాల వద్ద బారులుతీరిన వైనం

- రెండు రోజుల పాటు దుకాణాలకు సెలవు కావడంతో రద్దీ

- ఎండను సైతం లెక్క చేయకుండా పడిగాపులు

చోడవరం, మే 11: ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనుండడంతో శనివారం ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. మందుబాబులు ముందు జాగ్రత్తగా ఆదివారం, సోమవారం నాటి కోసం మద్యం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇదే సమయంలో గ్రామాల్లో పార్టీల నాయకులు కూడా తమ అనుచరులకు డబ్బులు ఇచ్చి మరీ వారికి అవసరమైన మద్యం తెప్పించేందుకు ప్రయత్నించడంతో దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. పరిమితంగానే దుకాణాల వద్ద మద్యం అమ్ముతుండడంతో దుకాణాల వద్ద పడిగాపులు కాసి మరీ మందుబాబులు మద్యం కొనుగోలు చేయడం కనిపించింది.

రావికమతంలో..

రావికమతం: మండలంలోని మద్యం దుకాణాల వద్ద శనివారం ఉదయం 8 గంటల నుంచే మందుబాబులు బారులుతీరారు. రావికమతంలో రెండు దుకాణాలు, తట్టబంద, దొండపూడి, కొత్తకోటలో ఉన్న మద్యం దుకాణాల వద్ద ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వేచి ఉన్నారు. గత రెండు రోజులుగా అధికార పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేయడంతో మందుబాబు జోష్‌ మీద ఉన్నారు.

నర్సీపట్నంలో..

నర్సీపట్నం: పట్నంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలు శనివారం కిటకిటలాడాయి. షాపులు తెరవక ముందే క్యూలో ఉన్న మందుబాబులు తెరిచిన తరువాత మద్యం కోసం ఎగబడ్డారు. ధనిమిరెడ్డివీధి, చింతపల్లి రోడ్డులో ఉన్న రెండు మద్యం దుకాణాల వద్ద తోపులాట కనిపించింది. ఎన్నిక నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకు ఎక్సైజ్‌ అధికారులు మద్యం షాపులు సీజ్‌ చేయనుండగా, సరకు నిల్వ చేసుకోవడానికి మందుబాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద క్యూ కట్టారు. మంగళవారం వరకు సరిపోయే విధంగా ఎగబడి మద్యం కొనుగోలు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలు ప్రకారం గత ఏడాది ఈ రోజున ఎంత సరకు విక్రయించారో అంత విక్రయించిన తరువాత దుకాణాలను మూసి వేయాల్సి ఉంది. దుకాణం తెరిచిన రెండు గంటల్లోనే సరకు అయిపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు చింతపల్లి రోడ్డులోని రెండు ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

Updated Date - May 12 , 2024 | 01:22 AM