వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:31 AM
జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఎం.విజయసునీత ఆదేశించారు.

అధికారులకు కలెక్టర్ ఎం.విజయసునీత ఆదేశం
రంపచోడవరం, చింతూరు డివిజన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
పాడేరు, జూన్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఎం.విజయసునీత ఆదేశించారు. వరదలపై ముందుస్తు చర్యలు, తదితర అంశాలలపై రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్.పురం మండలాల్లో వరదలు ఉధృతమయ్యే పరిస్థితులున్నాయని, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు వరదలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు పడకూడదని, వారికి అవసరమైన పునరావాస, సహాయక చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. గత రెండేళ్లుగా జూన్, జూలై నెలల్లో ఆయా ప్రాంతాల్లో చేపట్టే వరద సహాయక చర్యలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే మాట్లాడుతూ ముంపు ప్రాంత మండల కేంద్రాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు వారికి ముందస్తుగా మూడు నెలల రేషన్ సరకులు పంపిణీకి సిద్ధం చేశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందుస్తు ప్రణాళికతో పాటు వరద సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. చింతూరు ఐటీడీఏ పీవో చైతన్య మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్.పురం మండలాల్లో మొత్తం 62 పునరావాస కేంద్రాలు, 16 బోట్లు సిద్ధం చేశామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస, సహాయక చర్యలు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లా ఎస్‌పీ తుహిన్‌సిన్హా మాట్లాడుతూ వరదల ప్రభావంతో సమాచార వ్యవస్థలు దెబ్బతింటే, ప్రత్యామ్నాయంగా పోలీసులు, ఐటీడీఏ వద్ద ఉన్న శాటిలైల్, వైర్‌లెస్ సెట్లను వినియోగించుకోవచ్చునన్నారు. సహాయ బృందాలను సిద్ధం చేశామన్నారు. రంపచోడవరం, చింతూరు ప్రాంతాలతో సహా నాలుగు ముంపు మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ విజయసునీత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, రంపచోడవరం, చింతూరు డివిజన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.